బీసీసీఐ సరికొత్త నిబంధన.. నో బాల్ వేస్తే అంతే!

దేశవాళీ క్రికెట్‌లో పారదర్శకత, పోటీతత్వాన్ని మరింత పెంచే లక్ష్యంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పలు కీలక నిబంధనలను సవరించింది.

22 జులై, 2026 7:21 AM•ByJanavaani Admin

Share this article

బీసీసీఐ సరికొత్త నిబంధన.. నో బాల్ వేస్తే అంతే!

న్యూఢిల్లీ, జూలై 22: దేశవాళీ క్రికెట్‌లో పారదర్శకత, పోటీతత్వాన్ని మరింత పెంచే లక్ష్యంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పలు కీలక నిబంధనలను సవరించింది. ఎంసీసీ సిఫార్సుల ఆధారంగా రూపొందించిన ఈ నూతన నిబంధనలు వచ్చే నెలలో ప్రారంభమయ్యే దులీప్ ట్రోఫీతో అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు బీసీసీఐ మార్గదర్శకాలను పంపింది.

ఉద్దేశపూర్వక నో-బాల్‌పై కఠిన చర్యలు తీసుకోనుంది. కొత్త నిబంధనల ప్రకారం ఒక బౌలర్ కావాలనే ఫ్రంట్‌ఫుట్ నో-బాల్ లేదా నాన్-ల్యాండింగ్ డెలివరీ వేసినట్లు ఆన్‌ఫీల్డ్ అంపైర్లు నిర్ధారిస్తే, అతడిని ఆ ఇన్నింగ్స్‌కే కాకుండా మ్యాచ్ మొత్తంలో బౌలింగ్ చేయకుండా నిషేధిస్తారు. గతంలో ఈ నిషేధం సంబంధిత ఇన్నింగ్స్‌కే పరిమితమై ఉండగా, కొత్త నిబంధనతో మరింత కఠినతరం చేశారు.

రంజీ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ వంటి బహుళ రోజుల మ్యాచ్‌ల్లో కూడా కీలక మార్పులు చేశారు. ఇకపై రోజు చివరి ఓవర్‌లో వికెట్ పడినా ఆటను వెంటనే ముగించకుండా, ఆ ఓవర్‌లో మిగిలిన బంతులన్నీ పూర్తి చేసిన తర్వాతే ఆటను నిలిపివేయనున్నారు.

మరో కీలక నిర్ణయంగా, మ్యాచ్‌లో చివరి ఇన్నింగ్స్‌ను ఇకపై జట్లు డిక్లేర్ చేయడం లేదా వదిలేయడం (ఫర్‌ఫిట్) చేయడానికి అవకాశం ఉండదు. ఫలితాలను ప్రభావితం చేసే అవకాశాలను నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు వెల్లడించింది.

వన్డే మ్యాచ్‌ల్లో డ్రింక్స్ బ్రేక్ సమయంలో హెడ్ కోచ్ మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే వికెట్‌కీపర్లకు సంబంధించిన నిబంధనను కూడా సడలించారు. బౌలర్ బంతి విడుదల చేసే సమయంలో మాత్రమే కీపర్ గ్లౌవ్స్ స్టంప్స్ వెనుక ఉంటే సరిపోతుందని స్పష్టం చేశారు. ఈ కొత్త నిబంధనలపై అంపైర్లు, మ్యాచ్ రిఫరీలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు బీసీసీఐ తెలిపింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు