గురుగ్రామ్, ఆగస్టు 10 (జనవాణి): గురుగ్రామ్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో మరో సంచలన డీల్ నమోదైంది. డీఎల్‌ఎఫ్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘ది దహ్లియాస్’లోని ఓ పెంట్‌హౌస్‌ను వ్యాపారవేత్త మానవ్ సర్దానా ఏకంగా రూ.271 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ లావాదేవీ దేశంలోనే అత్యంత ఖరీదైన డీల్‌లలో ఒకటిగా నిలిచింది.
చదరపు అడుగుకు రూ.2.6 లక్షలు
ఈ డీల్‌లో మరో ఆసక్తికరమైన అంశం పెంట్‌హౌస్ చదరపు అడుగు ధర. దీని సూపర్ ఏరియా 17,200 చదరపు అడుగులు కాగా.. కార్పెట్ ఏరియా 10,500 చదరపు అడుగులు. రూ.271 కోట్ల ధరను సూపర్ ఏరియా ప్రాతిపదికన లెక్కిస్తే చదరపు అడుగుకు సుమారు రూ.1.58 లక్షలు వస్తుంది. అదే కార్పెట్ ఏరియా ప్రాతిపదికన చూస్తే దాదాపు రూ.2.6 లక్షలు పలికినట్లవుతుంది.
ఒక్క యూనిట్‌కే రూ.271 కోట్లు
ఈ లావాదేవీ దేశంలోనే అత్యంత ఖరీదైన సింగిల్-యూనిట్ రెసిడెన్షియల్ డీల్ అని సమాచారం. అయితే డీఎల్‌ఎఫ్ ఈ లావాదేవీపై స్పందించలేదు. ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే.. రూ.271 కోట్ల ధర దేశంలోనే అత్యంత పెద్ద రెసిడెన్షియల్ ట్రాన్సాక్షన్ అని చెప్పలేం. ముంబయిలో అంతకంటే ఎక్కువ విలువైన డీల్స్ జరిగాయి. అయితే వాటిలో కొన్ని బహుళ ఇళ్లు లేదా అనేక అంతస్తులతో కూడిన నివాసాలు ఉన్నాయి. దహ్లియాస్ డీల్‌లో మొత్తం రూ.271 కోట్లు ఒకే పెంట్‌హౌస్‌కు చెల్లించడం ప్రత్యేకత.
ముంబయికి దీటుగా గురుగ్రామ్
ఇప్పటివరకు దేశంలోని అల్ట్రా లగ్జరీ హౌసింగ్ మార్కెట్‌లో ముంబయి ఆధిపత్యం కొనసాగుతోంది. వర్లీ, మలబార్ హిల్, సౌత్ ముంబయిలోని సముద్రం ఎదురుగా ఉన్న లగ్జరీ ప్రాజెక్టులకు భారీ డిమాండ్ ఉంది. యూఎస్‌వీ చైర్‌పర్సన్ లీనా గాంధీ తివారీ వర్లీలోని నామన్ జానాలో రెండు సీ-ఫేసింగ్ డ్యూప్లెక్స్‌లను రూ.639 కోట్లకు కొనుగోలు చేసిన డీల్ ఇటీవల సంచలనం సృష్టించింది. వాటి మొత్తం విస్తీర్ణం సుమారు 22,572 చదరపు అడుగులు.
ఇండస్ట్రియలిస్ట్ జేపీ టపారియా ముంబయిలోని మలబార్ హిల్‌లో సుమారు 27,160 చదరపు అడుగుల ట్రిప్లెక్స్‌ను రూ.369 కోట్లకు కొనుగోలు చేశారు.
అయితే ఈ డీల్స్‌తో పోలిస్తే దహ్లియాస్ పెంట్‌హౌస్ కొనుగోలు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఎందుకంటే రూ.271 కోట్లు ఒకే నివాస యూనిట్‌కు చెల్లించారు.
రూ.380 కోట్ల డీల్ కూడా ఉంది
2025 అక్టోబరులో ఢిల్లీ–ఎన్‌సీఆర్‌కు చెందిన ఓ వ్యాపార కుటుంబం దహ్లియాస్‌లో నాలుగు అపార్ట్‌మెంట్లను దాదాపు రూ.380 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. వాటి మొత్తం విస్తీర్ణం 35,000 చదరపు అడుగులకు పైగా ఉంది. మాజీ భారత క్రికెటర్ శిఖర్ ధావన్ ఈ ప్రాజెక్టులో సుమారు రూ.69 కోట్ల విలువైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశారు. ప్రముఖ ఇన్వెస్టర్ మధుసూదన్ కేలా 2026లో 6,233 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా కలిగిన అపార్ట్‌మెంట్‌ను రూ.120.71 కోట్లకు కొనుగోలు చేశారు. కేలా డీల్‌లోనే కార్పెట్ ఏరియా ప్రాతిపదికన చదరపు అడుగుకు దాదాపు రూ.2 లక్షలు పలికింది.
రూ.100–200 కోట్ల ఇళ్లకు ఎందుకింత డిమాండ్?
అల్ట్రా లగ్జరీ మార్కెట్‌లో కొనుగోలుదారులు కేవలం చదరపు అడుగుల కోసం డబ్బు చెల్లించడం లేదు. లొకేషన్, ప్రైవసీ, భద్రత, ప్రత్యేకమైన సదుపాయాలు, వ్యూస్, బ్రాండ్ విలువ, అరుదైన భారీ నివాసం వంటి అంశాలు కీలకంగా మారుతున్నాయి.
గురుగ్రామ్ గోల్ఫ్ కోర్స్ రోడ్ ఇప్పటికే అత్యంత ఖరీదైన నివాస ప్రాంతంగా అభివృద్ధి చెందింది. డీఎల్‌ఎఫ్5 గోల్ఫ్ లింక్స్‌లో దహ్లియాస్‌తో పాటు క్యామెలియాస్, అరాలియాస్, మాగ్నోలియాస్ వంటి లగ్జరీ ప్రాజెక్టులు ఉన్నాయి.
భారత్‌లోని అల్ట్రా హై నెట్‌వర్త్ కుటుంబాలకు ల్యూటెన్స్ ఢిల్లీలో బంగ్లా లేదా రాజధాని శివార్లలో ఫార్మ్‌హౌస్ కొనుగోలు చేయడానికి బదులుగా ఇలాంటి ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసాలు ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి.




















