పిల్లల ఆరోగ్యానికి పెనుముప్పుగా మారిన చిప్స్, పిజ్జాబర్గర్లు
ఆరోగ్య పన్ను విధించాలని కేంద్రానికి ఐసీఎంఆర్-ఎన్‌ఐఎన్ సిఫారసు
ధరలు పెంచితే వినియోగం తగ్గుతుందని సూచన
Health Tax | చిప్స్, పిజ్జా, బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ప్యాకేజ్డ్ స్నాక్స్, మోమోస్, అధిక చక్కెర కలిగిన జంక్ ఫుడ్స్‌తో పాటు శీతల పానీయాలు పిల్లల ఆరోగ్యానికి పెను ముప్పుగా మారుతున్నాయి. రుచికి అలవాటుపడ్డ చిన్నారులు, యువతలో ఊబకాయం, మధుమేహం, రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు పెరుగుతుండడం నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని జంక్‌ఫుడ్ వినియోగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కొరఢా ఝుళిపించేందుకు సిద్ధమవుతోంది. భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్)కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించింది. జంక్‌ఫుడ్‌తో పాటు చక్కెర అధికంగా ఉండే పానీయాలపై ప్రత్యేకంగా హెల్త్ ట్యాక్స్ విధించాలని, లేదంటే ప్రస్తుతం ఉన్న పన్నులనే భారీగా పెంచాలని సిఫారసు చేసింది. దాంతో ధరలు పెరుగుతాయని, ఫలితంగా ఉత్పత్తుల కొనుగోలు తగ్గుతుందని, జనం ఆరోగ్యకరమైన ఆహారాల వైపు దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయని ఓ నివేదిక తెలిపింది.
చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయం
దేశంలో పిల్లల్లో ఊబకాయం వేగంగా పెరుగుతున్నట్లు నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం 5 నుంచి 19 సంవత్సరాల మధ్య వయసున్న దాదాపు 4.1 కోట్ల మంది పిల్లలు అధిక బరువు, ఊబకాయంతో బాధపడుతున్నట్లు పేర్కొంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే కాలంలో గుండె జబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు దేశంలోని పిల్లల్లో దాదాపు 10 శాతం మంది ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నారని నివేదిక వెల్లడించింది. అలాగే, యుక్తవయస్కుల్లో ఒక శాతం మందికి ఇప్పటికే మధుమేహం ఉన్నట్లు గుర్తించింది. మరో 5 శాతం మంది కిశోర బాలబాలికలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఏదో ఒక ఆరోగ్య సమస్య బారిన పడుతున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రకటనలపై కఠిన ఆంక్షలు
జంక్‌ఫుడ్ విక్రయాల కంటే వాటి ప్రచారమే పిల్లలను ఎక్కువగా ఆకర్షిస్తోందని నివేదిక పేర్కొంది. టెలివిజన్, సోషల్ మీడియా, డిజిటల్ వేదికల్లో చిన్నారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ప్రకటలన ప్రచారంపై కఠిన నిబంధనలు తీసుకురావాలని సూచించింది. ముఖ్యంగా అధిక ఉప్పు, చక్కెర, కొవ్వు ఉండే ఆహార పదార్థాల ప్రచారాన్ని నియంత్రించాలని అభిప్రాయపడింది. జంక్‌ఫుడ్‌పై పన్నులు పెంచడమే కాకుండా పోషకాహారాన్ని మరింత చౌకగా, అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నివేదిక స్పష్టం చేసింది. పండ్లు, కూరగాయలు, చిరుధాన్యాలు, పాలు, ఇతర పోషకాహార పదార్థాలను ప్రజలకు తక్కువ ధరలో అందుబాటులో ఉంచితే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పెరుగుతాయని సూచించింది. పట్టణీకరణ, ఫాస్ట్‌ఫుడ్ సంస్కృతి, శారీరక శ్రమ తగ్గిపోవడం, మొబైల్ ఫోన్లు, టెలివిజన్‌ల ముందు ఎక్కువ సమయం గడపడం, బయట ఆడుకునే అలవాటు తగ్గడం వంటి కారణాలతో పిల్లల్లో ఊబకాయం వేగంగా పెరుగుతోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తక్షణమే స్పందించి పరిస్థితిని నియంత్రించకపోతే భవిష్యత్‌లో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.




















