NABARD Survey | గ్రామీణ భారతంలోని కుటుంబాల ఆదాయం తగ్గుతోంది. మరోవైపు రోజువారీ ఖర్చులు మాత్రం అంతకంతకూ పెరుగుతున్నాయి. దాంతో పొదుపు, ఉపాధి, భవిష్యత్ ఆదాయ అవకాశాలపై ఆందోళన వ్యక్తమవుతోంది. దేశవ్యాప్తంగా 20వేల గ్రామీణ కుటుంబాలపై నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయాలు వెలుగుచూశాయి. ఇటీవల నిర్వహించిన సర్వే ప్రకారం.. గత ఏడాదితో పోలిస్తే తమ ఆదాయం ఏమాత్రం పెరగలేదని 52.6శాతం కుటుంబాలు తెలిపాయి. మరో 19.8 శాతం కుటుంబాలు ఆదాయం తగ్గిపోయిందని వెల్లడించాయి. కేవలం 27.7 శాతం కుటుంబాలు మాత్రమే ఆదాయం పెరిగిందని చెప్పాయి. 2024 సెప్టెంబర్ నుంచి నాబార్డ్ ఈ సర్వే నిర్వహిస్తుండగా.. ఆదాయం పెరిగిందని చెప్పిన కుటుంబాల శాతం ఇదే అత్యల్పంగా నమోదైంది.
పెరుగుతున్న ఖర్చులు..
ఆదాయం పెరగకపోయినా గ్రామీణ కుటుంబాల వినియోగ వ్యయం మాత్రం గణనీయంగా పెరిగినట్లు సర్వే తెలిపింది. గత ఏడాదిలో తమ కుటుంబ ఖర్చులు పెరిగాయని 74.1 శాతం కుటుంబాలు వెల్లడించాయి. ప్రస్తుతం గ్రామీణ కుటుంబాలు తమ నెలవారీ ఆదాయంలో సగటున 66.5 శాతం వినియోగ ఖర్చులకే వెచ్చించాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆవేదన వ్యక్తం చేశాయి. అయితే, ఇందులో తినడానికే ఎక్కువగా ఖర్చవడంతో గమనార్హం. ఇక కుటుంబాల నెలవారీ ఆదాయంలో 13.6 శాతం మాత్రమే పొదుపులకు వెళ్తుండగా.. 12.5 శాతం పాత అప్పుల చెల్లింపులకే పోతోంది. ఆదాయం పెరగకపోవడం, ఖర్చులు పెరగడం వల్ల పొదుపు క్రమంగా తగ్గుతోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే మూడు నెలల్లో ఉపాధి పరిస్థితులు మెరుగుపడతాయని 39.3 శాతం కుటుంబాలు మాత్రమే ఆశాభావం వ్యక్తం చేశాయి. అదే సమయంలో వచ్చే మూడు నెలల్లో తమ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్న కుటుంబాల శాతం 41.2శాతానికి పడిపోయింది. నాబార్డ్ ఈ సర్వే ప్రారంభించినప్పటి నుంచి ఇదే అత్యల్ప స్థాయి కావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, వచ్చే ఏడాది కాలంలో పరిస్థితి మెరుగుపడుతుందన్న చాలామంది ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వేలో పాల్గొన్న 69.6 శాతం కుటుంబాలు వచ్చే ఏడాదిలో తమ ఆదాయం పెరుగుతుందని అంచనా వేశాయి.
ద్రవ్యోల్బణం భయాలు..
గ్రామీణ కుటుంబాల్లో ద్రవ్యోల్బణంపై ఆందోళన కూడా పెరుగుతోంది. వచ్చే ఏడాది సగటు ద్రవ్యోల్బణం 5.8 శాతంగా ఉండొచ్చని కుటుంబాలు అంచనా వేశాయి. ఇదే అంచనా 2026 మార్చి సర్వేలో 4.4 శాతంగా ఉండటం గమనార్హం. కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ద్రవ్యోల్బణ అంచనాలు గణనీయంగా పెరగడం గ్రామీణ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపే అంశంగా నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న భయం, మరోవైపు ఆదాయం మందగించడం వల్ల గ్రామీణ కుటుంబాల కొనుగోలు శక్తిపై ఒత్తిడి పెరుగుతోందని చెబుతున్నారు. ఇప్పటికే రోజువారీ అవసరాలకే పెద్దమొత్తంలో వెచ్చిస్తున్న కుటుంబాలకు ఇది మరింత భారంగా మారే అవకాశముందని విశ్లేషిస్తున్నారు. ఇక సర్వేలో మరో ఆందోళనకర అంశం కూడా వెలుగుచూసింది. 23.6 శాతం కుటుంబాలు పూర్తిగా అనధికార వనరుల నుంచే రుణాలు తీసుకుంటున్నట్లు వెల్లడించాయి. బ్యాంకులు, సహకార సంస్థలకు బదులుగా ప్రైవేటు వ్యక్తులు, వడ్డీవాప్యారులపై ఆధారపడటం గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఇంకా కొనసాగుతున్న సమస్యను సూచిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.
సర్వేలో కీలక అంశాలు..
52.6శాతం కుటుంబాల ఆదాయం గత ఏడాదిలో పెరగలేదు.
19.8శాతం కుటుంబాల్లో ఆదాయం తగ్గింది.
27.7శాతం కుటుంబాల్లో మాత్రమే ఆదాయం పెరిగింది.
74.1శాతం కుటుంబాల వినియోగ వ్యయం పెరిగింది.
నెలవారీ ఆదాయంలో 66.5శాతం ఖర్చులకే వెచ్చిస్తున్నారు.
13.6శాతం మాత్రమే పొదుపు.
12.5శాతం పాత అప్పుల చెల్లింపులకే.
23.6శాతం కుటుంబాలు వడ్డీ వ్యాపారులిచ్చే రుణాలపైనే ఆధారం.
వచ్చే ఏడాది ద్రవ్యోల్బణం 5.8శాతంగా ఉండొచ్చని గ్రామీణ కుటుంబాల అంచనా.




















