Jio Prime | రీఛార్జ్ ధరలు పెరుగుతాయన్న ఆందోళనలో ఉన్న జియో వినియోగదారులకు రిలయన్స్ జియో కొత్త సదుపాయాన్ని ప్రకటించింది. ‘జియో ప్రైమ్’ పేరుతో తీసుకొచ్చిన ఈ మెంబర్‌షిప్‌లో భాగంగా.. ఒకేసారి రూ.300 చెల్లిస్తే అర్హత ఉన్న ప్రస్తుత జియో ప్లాన్ ధరను 5 సెప్టెంబర్ 2027 వరకు లాక్ చేసుకోవచ్చు. అంటే ప్రైమ్ సభ్యత్వ కాలంలో అర్హత కలిగిన ప్లాన్‌ను ప్రస్తుత ధరకే రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రూ.299 ప్లాన్ కొనసాగుతుందని జియో స్పష్టం చేసింది. టెలికాం రంగంలో రీఛార్జ్ ధరలపై చర్చ జరుగుతున్న సమయంలో ఈ ప్రకటన వచ్చింది. ఇటీవల ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్‌లను పునర్వ్యవస్థీకరించి.. రూ.299 సహా కొన్ని ప్రజాదరణ పొందిన ప్లాన్‌లను తొలగించింది. దీంతో 28 రోజుల కాలపరిమితితో రోజువారీ డేటా అందించే విభాగంలో రూ.349 ప్లాన్ ఆప్షన్‌గా మారింది. ఈ నేపథ్యంలో జియో రూ.299 ప్లాన్‌ను కొనసాగిస్తూ.. ధరను లాక్ చేసుకునే అవకాశం కల్పించడం వినియోగదారులకు ఊరట కలుగనుంది.
ప్లాన్ మార్చుకునే అవకాశం
జియో ప్రైమ్ సభ్యత్వం తీసుకున్న తర్వాత యూజర్లు ఒకే రీఛార్జ్ ప్లాన్‌కు పరిమితం కావాల్సిన అవసరం లేదు. అవసరానికి అనుగుణంగా మరో జియో ప్లాన్‌కు మారినా ప్రైమ్ ప్రయోజనాలు కొనసాగుతాయి. వినియోగం, అవసరాలను బట్టి ప్లాన్ మార్చుకుంటూనే ధర లాక్ సదుపాయాన్ని పొందవచ్చు. జియో ప్రైమ్ సభ్యత్వం ఆగస్టు 20 అందుబాటులోకి రానుంది. మైజియో యాప్, జియో డాట్‌కామ్, జియో స్టోర్లు, అధీకృత జియో భాగస్వామి స్టోర్ల ద్వారా సభ్యత్వాన్ని తీసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారులతో పాటు కొత్త జియో కస్టమర్లకూ ఈ సదుపాయం వర్తిస్తుంది. ఇతర నెట్‌వర్క్‌ల వినియోగదారులు తమ నంబర్‌ను జియోకు పోర్ట్ చేసుకోవడం లేదా కొత్త జియో కనెక్షన్ తీసుకోవడం ద్వారా ప్రైమ్ సభ్యత్వాన్ని పొందవచ్చు.
కేవలం ప్లాన్ లాక్ మాత్రమే కాదు..
జియో ప్రైమ్ సాధారణ రీఛార్జ్ ప్లాన్ కాదు. తప్పనిసరిగా చేసుకోవాల్సిన రీఛార్జ్ కూడా కాదు. రూ.300 చెల్లించి తీసుకునే మెంబర్‌షిప్ ఫెసిలిటీ. ధర లాక్‌తో పాటు అదనపు ప్రయోజనాలను కూడా కంపెనీ ప్రకటించింది. ప్రైమ్ సభ్యులకు మొత్తం రూ.600 విలువైన రెండు క్యాష్‌బ్యాక్ వోచర్లు లభిస్తాయి. ఇందులో ఒక రూ.300 వోచర్‌ను కొత్త జియోహోమ్, జియోపీసీ కనెక్షన్ తీసుకునేందుకు వినియోగించుకోవచ్చు. మరో రూ.300 వోచర్‌ను కుటుంబ సభ్యుడు, స్నేహితుడి కోసం కొత్త జియో సిమ్ కొనుగోలుకు ఉపయోగించవచ్చు. వీటితోపాటు కొత్త జియో ఉత్పత్తులు, సేవలకు ముందస్తు యాక్సెస్, ప్రత్యేక కస్టమర్ సపోర్ట్ ఛానల్ ద్వారా ప్రాధాన్య సేవలను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.




















