జీవి (Jiivi):
లవ్ ఫెయిలైన ఓ కుర్రాడు అనుకోని పరిస్థితుల్లో తన ఓనర్ ఇంట్లోనే దొంగతనం చేస్తాడు. అయితే ఆ తర్వాత జరిగే ఊహించని సంఘటనలు, యాదృచ్చికాలు (Coincidences) అతన్ని ఎలా ఇబ్బంది పెట్టాయనేది చాలా ఇంటెలిజెంట్‌గా తెరకెక్కించారు. విధి, కర్మ సిద్ధాంతం చుట్టూ తిరిగే ఈ కథ చాలా ఫ్రెష్ ఫీల్‌ను ఇస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో ఫ్రీగా అందుబాటులో ఉంది.
కెడవర్ (Cadaver):
పోలీసులకే సవాలు విసిరే ఓ హై-ప్రొఫైల్ మర్డర్ మిస్టరీ ఇది. జైలులో ఉన్న ఖైదీ తాను హత్య చేశానని ఒప్పుకోవడమే కాకుండా, ఇంకా హత్యలు జరుగుతాయని ముందుగానే హింట్ ఇస్తాడు. ఈ క్లిష్టమైన కేసును ఛేదించడానికి ఫోరెన్సిక్ సర్జన్ భద్ర (అమలా పాల్) రంగంలోకి దిగుతుంది. మెడికల్ సైన్స్, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జోడించి రాసుకున్న ఈ కథ చివరి వరకూ ఉత్కంఠ రేపుతుంది. అమలా పాల్ అద్భుతమైన నటన ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. ఈ సినిమా యూట్యూబ్‌లో తెలుగులో అందుబాటులో ఉంది.
ఆపరేషన్ జావా (Operation Java):
కేవలం ఫైట్లు, ఛేజింగులే కాకుండా బుర్రతో ఆలోచింపజేసే సినిమా ఇది. కేరళలో జరిగిన కొన్ని రియల్ సైబర్ క్రైమ్ కేసుల ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. ఒక డెడికేటెడ్ టీమ్ ఆన్‌లైన్ మోసాలను ఎలా ఛేదించింది అనేదే దీని ప్రధాన కథ. ఇందులో టెక్నికల్ అంశాలను కళ్లకు కట్టినట్లు చూపుతూనే, క్యారెక్టర్ల ఎమోషన్స్‌ని చాలా నేచురల్‌గా మలిచారు. 2021లో వచ్చిన ఈ మలయాళం హిట్ మూవీ ప్రస్తుతం యూట్యూబ్‌లో ఫ్రీగా అందుబాటులో ఉంది. మలయాళంతో పాటు హిందీ భాషలో అందుబాటులో ఉంది. తెలుగులో చూడాలనుకుంటే మాత్రం జీ5 ఓటీటీలో ఉంది.
కుట్రం 23 (Kuttram 23):
మెడికల్ ఫీల్డ్‌లో జరిగే నేరాల నేపథ్యంలో సాగే పక్కా యాక్షన్ థ్రిల్లర్ ఇది. అరుణ్ విజయ్ ఏసీపీ వెట్రిమారన్‌గా సీరియస్ లుక్‌లో అదరగొట్టాడు. వరుస హత్యల వెనుక ఉన్న లింకులను పట్టుకునే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. యాక్షన్, మిస్టరీని చక్కగా బ్యాలెన్స్ చేస్తూ సాగే ఈ తమిళ్ సినిమా థ్రిల్లర్ జోనర్ ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. తెలుగులో క్రైమ్ 23 పేరుతో యూట్యూబ్‌లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
7th డే (7th Day):
సస్పెన్స్ థ్రిల్లర్స్ అమితంగా ఇష్టపడే వారికి ఈ సినిమా చక్కటి విజువల్ ట్రీట్. పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక సస్పెండ్ అయిన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తాడు. ఐదుగురు స్నేహితుల వింత ప్రవర్తన వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించే క్రమంలో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులకు మైండ్ బ్లాక్ చేస్తాయి. సౌత్ నుంచి వచ్చిన బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్స్‌లో ఇది ఒకటిగా నిలుస్తుంది. ముఖ్యంగా దీని క్లైమాక్స్ ఊహకు కూడా అందదు. ఈ సినిమాను యూట్యూబ్‌లో ఫ్రీగా చూడొచ్చు. ఇంగ్లీష్, మలయాళంతో పాటు హిందీ భాషలో అందుబాటులో ఉంది.
కురంగు బొమ్మై (Kurangu Bommai):
సుందరం అనే ఒక నిజాయితీ గల పనిమనిషి, విలువైన విగ్రహం స్మగ్లింగ్ గొడవలో అనుకోకుండా ఎలా చిక్కుకున్నాడనేదే ఈ చిత్ర కథ. మనుషుల మధ్య ఉండే నమ్మకం, ద్రోహం వంటి భావోద్వేగాలను చూపిస్తూనే కథను అత్యంత థ్రిల్లింగ్‌గా నడిపించారు. పైకి చాలా సింపుల్‌గా కనిపించినా, కథలో ఎన్నో బలమైన లేయర్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ క్రైమ్ డ్రామాను యూట్యూబ్‌లో ఫ్రీగా వీక్షించవచ్చు. అయితే హిందీ భాషలో మాత్రం ఈ సినిమా అందుబాటులో ఉంది.
పతామ్ వలవు (Pathaam Valavu):
జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన ఓ ఖైదీని పట్టుకోవడానికి వెళ్లిన పోలీస్ ఆఫీసర్ ప్రయాణమే ఈ చిత్రం. పూర్తిగా ఎమోషన్స్, పగ, ప్రతీకారాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మలయాళం థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడే వారికి ఈ ఎమోషనల్ అండ్ ఇంటెన్స్ డ్రామా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమాను యూట్యూబ్‌లోని 'Ultra Movie Parlour' ఛానెల్‌లో ఫ్రీగా చూడవచ్చు.




















