సినిమా డెస్క్: టాలీవుడ్‌లో మరో భారీ మల్టీస్టారర్‌కు రంగం సిద్ధమవుతోందనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి, నాగార్జున మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో కొన్ని చిత్రాల్లో ఇద్దరూ కనిపించినప్పటికీ, పూర్తి స్థాయి మల్టీస్టారర్‌లో కలిసి నటించే అవకాశం మాత్రం ఇప్పటివరకు రాలేదు. దీంతో ఈ కాంబోపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఇటీవల చిరంజీవితో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న అనిల్ రావిపూడి,సీనియర్ స్టార్ హీరోలతో వరుస విజయాలు నమోదు చేస్తున్నారు. వెంకటేష్‌తో నాలుగు సినిమాలు చేసి, బాలకృష్ణతో భగవంత్ కేసరి వంటి సందేశాత్మక చిత్రం తెరకెక్కించిన ఆయన ఇప్పుడు నాగార్జునతో కూడా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో వెంకటేష్, బాలకృష్ణ, చిరంజీవితో ఇప్పటికే పనిచేసిన అనిల్ రావిపూడి నాగార్జునతో మాత్రం ఇప్పటివరకు సినిమా చేయలేదు. గతంలో కూడా నాగార్జునతో సినిమా చేయాలనే ఆసక్తిని దర్శకుడు అనిల్ రావిపూడి వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలో చిరంజీవి,నాగార్జున కాంబినేషన్‌లో మల్టీస్టారర్ రూపొందే అవకాశం ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుపై ఇప్పటివరకు చిత్ర బృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అధికారిక ప్రకటన వస్తేనే ఈ మల్టీస్టారర్‌పై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.




















