కొంతమంది గురించి ఎంత చెప్పినా మాటలు సరిపోవు. అలాంటి గొప్ప నటీమణుల్లో సౌందర్య ఒకరు. ఇప్పటి జనరేషన్‌లో చాలామందికి ఆమె గురించి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు సౌందర్య అంటే టాలీవుడ్‌లో ఓ సంచలనం. ఆమె సినిమా వస్తుందంటే స్టార్ హీరో సినిమా రిలీజ్‌కు ఉండేంత హడావుడి కనిపించేది. కన్నడ అమ్మాయి అయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం అచ్చం మన ఇంటి అమ్మాయిలా దగ్గరైపోయారు. ఇక ఆమె అసలు పేరు సౌందర్య కాదనే విషయం చాలా మందికి తెలియదు.
సౌందర్య అసలు పేరు సౌమ్య సత్యనారాయణ. సౌమ్య పేరు సింపుల్‌గా ఉందని.. సౌందర్య అనే స్క్రీన్ నేమ్ బాగుంటుందని.. ప్రముఖ నటుడు, కథా రచయిత కుణిగల్ ఆమెకు సౌందర్య అని పేరు పెట్టాడు. సౌందర్య అంటే సుందరమైన అని అర్థం వస్తుంది. ఇక ఆ పేరు దక్షిణాదిలో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 1972 జూలై 18న కర్ణాటకలోని ముల్బాగల్‌లో జన్మించారు. ఆమె తండ్రి సత్యనారాయణ రచయితగా నిర్మాతగా పనిచేశారు. 1992లో వచ్చిన 'గంధర్వ' అనే కన్నడ సినిమాతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. దాదాపు 12 ఏళ్ల కెరీర్‌లో 120కి పైగా సినిమాల్లో నటించిన సౌందర్య తెలుగు కన్నడ తమిళ హిందీ భాషల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ఆమెను ఇప్పటికీ సావిత్రి తర్వాతి తరంలో గొప్ప నటిగా గుర్తు చేసుకుంటారు.
'మనవరాలి పెళ్లి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సౌందర్య 'రాజేంద్రుడు గజేంద్రుడు'తో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత వరుస విజయాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 'మాయలోడు', 'హలో బ్రదర్', 'సూపర్ పోలీస్', 'మేడమ్', 'టాప్ హీరో', 'పెదరాయుడు', 'అమ్మోరు', 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు', 'పవిత్ర బంధం', 'పెళ్లి చేసుకుందాం' లాంటి ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.
ఒక దశలో సౌందర్య కాల్షీట్ల కోసం స్టార్ హీరోలు కూడా ఎదురుచూసేవారంటే ఆమె క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ముందుగా సౌందర్య డేట్స్ తీసుకుని ఆ తర్వాత హీరోల డేట్స్ సెట్ చేసుకునేవారని కూడా అప్పట్లో చెప్పుకునేవారు. తన నటనతో పాటు మంచి వ్యక్తిత్వంతో కూడా ప్రేక్షకుల మనసుల్లో సౌందర్య ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
అయితే ఇంతటి క్రేజ్ ఉన్న సౌందర్య జీవితం మాత్రం చాలా చిన్న వయసులోనే ముగిసిపోయింది. 2004 ఏప్రిల్ 17న జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు. అప్పటికి ఆమె వయసు కేవలం 31 ఏళ్లు. ఆమె మరణవార్తతో దక్షిణాది సినిమా పరిశ్రమ ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. సౌందర్య మరణం ఇప్పటికీ అభిమానులకు తీరని లోటుగానే మిగిలిపోయింది.




















