సినిమా డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ చిత్రం 'వారణాసి' (వర్కింగ్ టైటిల్) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మహేష్ సినీ ప్రయాణంలో చాలా మందికి తెలియని ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అదేంటంటే.. మహేష్ బాబుతో ఒకప్పుడు రొమాంటిక్ సాంగ్‌లో కనిపించిన ఓ స్టార్ హీరోయిన్, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత అదే మహేష్‌కు తల్లి పాత్రలో నటించారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు రమ్యకృష్ణ.
2004లో దర్శకుడు ఎస్.జే. సూర్య తెరకెక్కించిన 'నాని' సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించారు. ఆ చిత్రంలో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించడంతో పాటు మహేష్‌తో ఓ రొమాంటిక్ సాంగ్‌లో కూడా సందడి చేశారు. అయితే సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో ఆ సాంగ్ పెద్దగా ప్రేక్షకుల దృష్టికి రాలేదు.
ఆ తర్వాత దాదాపు 20 ఏళ్లకు, దర్శకుడు *త్రివిక్రమ్ శ్రీనివాస్* తెరకెక్కించిన 'గుంటూరు కారం' సినిమాలో రమ్యకృష్ణ, మహేష్ బాబుకు తల్లి పాత్రలో కనిపించారు. ఒకప్పుడు హీరోయిన్లా స్క్రీన్ షేర్ చేసుకున్న ఆమె, తర్వాత అమ్మ పాత్రలో నటించడం ప్రేక్షకులకు ఆసక్తికరమైన అనుభూతిని కలిగించింది.
ప్రస్తుతం రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుస అవకాశాలతో బిజీగా ఉన్నారు. కథకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటూ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా 'బాహుబలి'లో శివగామి పాత్ర తర్వాత ఆమెకు మరింత క్రేజ్ పెరిగింది.
ఇక మహేష్ బాబు విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ అడ్వెంచర్ చిత్రంపైనే పూర్తిగా దృష్టి సారించారు. ఈ సినిమా పూర్తయ్యే వరకు కొత్త ప్రాజెక్టులు అంగీకరించబోరని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.




















