బంగ్లాదేశ్: బంగ్లాదేశ్‌లోని రంగ్‌పూర్‌లో ఓ హిందూ కుటుంబం దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. రంగ్‌పూర్ నగరంలోని దాస్‌పారా ప్రాంతంలో మాజీ ఉపాధ్యాయుడు గణపతి చక్రవర్తి (65), ఆయన భార్య ప్రీతిలత (50), కుమార్తె ఆగామి (23), కుమారుడు ప్రియమ్ (12) మృతదేహాలు లభించాయి. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్ధార్థ దాస్, ముగ్ధ దాస్ అనే ఇద్దరు వ్యక్తులు పక్క భవనం మీదుగా గణపతి ఇంటి పైకప్పుపైకి వెళ్లారు. అక్కడ వారు డ్రగ్స్ సేవిస్తున్న సమయంలో శబ్దాలు రావడంతో గణపతి పైకప్పుపైకి వెళ్లి వారిని ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో గొడవ జరగడంతో నిందితులు తమను గుర్తిస్తారనే భయంతో గణపతిని తువ్వాలతో గొంతు బిగించి హత్య చేసినట్లు పేర్కొన్నారు. గణపతి అరుపులు విని పైకి వచ్చిన ఆయన భార్య ప్రీతిలతను కూడా మెట్ల వద్ద గొంతు బిగించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కుమార్తె ఆగామి, 12 ఏళ్ల కుమారుడు ప్రియమ్‌ను కూడా హత్య చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతదేహాల్లో గణపతి మృతదేహం ఇంటి పైకప్పు పైన, ప్రీతిలత, ఆగామి మృతదేహాలు మెట్ల వద్ద, ప్రియమ్ మృతదేహం ఇంట్లోని మంచం కింద లభించినట్లు అధికారులు తెలిపారు.
హత్యల తర్వాత కూడా ఇంట్లోనే..
ఈ కేసులో అత్యంత విస్తుపోయే విషయం ఏమిటంటే.. నలుగురిని హత్య చేసిన తర్వాత నిందితులు వెంటనే అక్కడి నుంచి పారిపోలేదని పోలీసులు తెలిపారు. కొన్ని గంటల పాటు అదే ఇంట్లోనే ఉండి స్నానం చేసినట్లు, ఫ్రిజ్‌లో ఉన్న దోసకాయలు, ఖర్జూరాలు తిన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం తమ వద్ద ఉన్న డ్రగ్స్‌ను అక్కడే సేవించినట్లు పోలీసులు పేర్కొన్నారు. శుక్రవారం ప్రార్థనల సమయంలో రోడ్లపై రద్దీ తక్కువగా ఉండటాన్ని గమనించి నిందితులు ఇంటి నుంచి బయటకు వెళ్లినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. హత్యలను దోపిడీ ఘటనగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో సిద్ధార్థ దాస్, ముగ్ధ దాస్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.




















