పెద్దపల్లి, ఆగస్టు 24 (జనవాణి): పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉగ్ర లింకుల అనుమానాలు కలకలం రేపాయి. అయోధ్య నగర్‌లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో రామగుండానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ముజామిల్ ఖాన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ముజామిల్ ఖాన్‌కు ఉగ్రవాద సంస్థలు లేదా టెర్రరిస్ట్ గ్రూపులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో NIA అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడిని ఎన్‌టీపీసీ పోలీస్‌స్టేషన్‌కు తరలించి ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. విద్యార్థికి ఉగ్రవాదులతో ఎలాంటి పరిచయాలు ఉన్నాయి? ఏవైనా సంస్థలతో సంబంధాలు ఉన్నాయా? వారి కార్యకలాపాలకు సహకారం అందించాడా? అనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. ఇదేవిదంగా మూడేళ్ల క్రితం కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉగ్ర లింకుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో జగిత్యాలకు చెందిన ఓ వ్యక్తిని NIA అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా రామగుండంలో ఇంజినీరింగ్ విద్యార్థిని అదుపులోకి తీసుకుని సోదాలు నిర్వహించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.




















