అక్రమ పాన్‌మసాలా తయారీ కేంద్రంపై సీజీఎస్టీ దాడులు.. రూ.76 లక్షల సరుకు సీజ్..కీలక వ్యక్తి అరెస్ట్

మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలో అక్రమంగా నిర్వహిస్తున్న పాన్‌మసాలా, పొగాకు తయారీ కేంద్రంపై సెంట్రల్‌ జీఎస్టీ (సీజీఎస్టీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.76 లక్షల విలువైన సరుకును స్వాధీనం చేసుకుని, కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు.

25 ఆగస్టు, 2026 9:06 PM•ByNarender Kumar Nangunoori

Share this article

అక్రమ పాన్‌మసాలా తయారీ కేంద్రంపై సీజీఎస్టీ దాడులు.. రూ.76 లక్షల సరుకు సీజ్..కీలక వ్యక్తి అరెస్ట్

Social Media Image

హైదరాబాద్, ఆగస్టు 25 (జనవాణి): మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లాలో అక్రమ పాన్‌మసాలా, పొగాకు తయారీ కేంద్రం గుట్టురట్టైంది. హైదరాబాద్‌ నగర శివార్లలోని ఓ షెడ్‌లో పాన్‌మసాలా, పొగాకు ఉత్పత్తులను రహస్యంగా తయారు చేస్తున్నట్లు సీజీఎస్టీ అధికారులకు సమాచారం అందింది. సమాచారం మేరకు అధికారులు సదరు కేంద్రంపై దాడులు నిర్వహించారు.

తనిఖీల్లో అక్రమంగా నిల్వ ఉంచిన, తయారు చేస్తున్న పాన్‌మసాలా, పొగాకు ఉత్పత్తులను గుర్తించారు. మొత్తం రూ.76 లక్షల విలువైన సరుకును సీజ్ చేశారు. ఈ దాడుల్లో 2,015 కిలోల పాన్‌ మసాలా మిశ్రమంతోపాటు 810 కిలోల పొగాకు స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా 40 ఎఫ్‌ఎఫ్‌ఎస్‌ ప్యాకింగ్‌ యంత్రాలను సీజ్ చేశారు. ఈ కేంద్రంలో 56 మంది కార్మికుల పని చేస్తున్నట్లు గుర్తించారు. పలు బ్రాండ్లతో పాటు పేరు లేని పాన్‌ మసాలా, జర్దాను తయారీ చేస్తున్నట్లు సీజీఎస్టీ అధికారులు కనుగొన్నారు. ఈ అక్రమ ఉత్పత్తుల రవాణాకు వినియోగిస్తున్న రెండు వాహనాలు సీజ్‌ చేశారు.

ఈ వ్యవహారానికి సంబంధించి కీలక వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని హైదరాబాద్‌లోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కేసును పరిశీలించిన కోర్టు నిందితుడికి 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. అక్రమ తయారీ, పన్ను ఎగవేతకు పాల్పడుతున్న కేంద్రాలపై సీజీఎస్టీ అధికారులు దృష్టి సారించిన నేపథ్యంలో ఈ దాడులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు