సికింద్రాబాద్,సెప్టెంబర్ 5 (జనవాణి): బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌లో జరిగిన ఆయుధాల చోరీ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. అత్యాధునిక ఆయుధాలు, తూటాలు చోరీకి గురై నాలుగు రోజులు గడిచినా వాటి ఆచూకీ లభించకపోవడంతో భద్రతా వర్గాల్లో ఆందోళన పెరుగుతోంది. ఘటన వెనుక ఉగ్రకుట్ర ఏమైనా ఉందా అనే కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కూడా విచారణలో భాగస్వామ్యమైంది.
దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయుధాగారం (కోట్) వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రతిరోజూ రాత్రి 10:30 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు గుర్తించారు. అధికారుల అనుమతి లేకుండా సీసీటీవీలను ఎందుకు ఆపేవారనే అంశంపై ప్రత్యేకంగా విచారణ కొనసాగుతోంది.
అంతేకాకుండా గత పది రోజులుగా ఆయుధాలు, మందుగుండు సామగ్రికి సంబంధించిన రికార్డుల నమోదులో తీవ్ర లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆయుధాలను ఒకేసారి కాకుండా విడతల వారీగా బయటకు తరలించి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతర్గత వ్యక్తులపైనే అనుమానాలు
అత్యంత భద్రత కలిగిన ఆయుధాగారంలోకి బయట వ్యక్తులు సులభంగా ప్రవేశించడం సాధ్యం కాదని పోలీసులు భావిస్తున్నారు. దీంతో రెజిమెంట్‌లోని అంతర్గత వ్యక్తుల సహకారం లేకుండా ఈ చోరీ జరిగి ఉండదనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
ఉగ్రవాద, తీవ్రవాద కోణాలపై NIA, ఇంటెలిజెన్స్ బ్యూరో (IB), మిలిటరీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆధారాలు సేకరిస్తున్నారు. రెజిమెంట్‌లో పనిచేస్తున్న దాదాపు 800 మంది సిబ్బందితో పాటు చోరీ జరిగిన రోజు విధుల్లో ఉన్నవారిని, గతంలో బదిలీపై వెళ్లిన సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. అనుమానితుల ఫోన్ కాల్ డేటాను సైతం విశ్లేషిస్తున్నారు.
ఆయుధాలు ఎక్కడున్నాయనే దానిపై ఆరా
చోరీకి గురైన అత్యాధునిక ఆయుధాలు, తూటాలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి? అవి ఎవరి చేతికి చేరాయి? అనే అంశాలపై దర్యాప్తు సంస్థలు ప్రధానంగా దృష్టి సారించాయి. ఆయుధాలు త్వరగా స్వాధీనం కాకపోతే భవిష్యత్తులో తీవ్ర భద్రతా ముప్పు తలెత్తే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చోరీ ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని లోతుగా పరిశీలిస్తూ దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు.




















