విద్యార్థులు ఒక్కొక్కరు ఒక మొక్కను దత్తత తీసుకుని సంరక్షించాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

కాకతీయ వైద్య కళాశాల, వరంగల్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో, కళాశాల యాజమాన్యం సహకారంతో కళాశాల ప్రాంగణంలో మెగా ప్లాంటేషన్ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి పచ్చదనం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.

18 ఆగస్టు, 2026 3:14 PM•ByNarender Kumar Nangunoori

Share this article

విద్యార్థులు ఒక్కొక్కరు ఒక మొక్కను దత్తత తీసుకుని సంరక్షించాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

వరంగల్, ఆగస్టు 18 (జనవాణి): వరంగల్ లోని కాకతీయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో, కళాశాల యాజమాన్యం సహకారంతో కాకతీయ వైద్య కళాశాల ప్రాంగణంలో మెగా ప్లాంటేషన్ వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డా. కస్తూరి శ్రీధర్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. వృక్షో రక్షతి రక్షితః అనే భావనతో మొక్కలను కాపాడితే అవే మనలను కాపాడతాయని పేర్కొన్నారు. మొక్కలు నాటడం ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతర బాధ్యతగా భావించాలని సూచించారు. వైద్య విద్యార్థులు ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను దత్తత తీసుకుని, దానికి క్రమం తప్పకుండా నీరు పోసి సంరక్షించాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. వైద్య కళాశాలలో ఐదేళ్లు చదువు పూర్తి చేసే సమయానికి, దత్తత తీసుకున్న మొక్క కూడా ఐదేళ్ల పాటు పెరిగి పెద్దదిగా మారేలా బాధ్యత తీసుకోవాలని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్మించడంతో పాటు అనేక వ్యాధులను నివారించేందుకు కూడా దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించి పెద్ద సంఖ్యలో మొక్కలను ఉచితంగా అందించిన అటవీ శాఖను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అభినందించారు.

పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డా. కస్తూరి శ్రీధర్ మాట్లాడుతూ, కాకతీయ వైద్య కళాశాలతో పూర్వ విద్యార్థులకు ఉన్న అనుబంధం, కళాశాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలనే బాధ్యతను ఈ కార్యక్రమం ద్వారా చాటుతున్నామని తెలిపారు. అటవీ శాఖ అధికారులు అందించిన సహకారానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ, కాకతీయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కళాశాలతో ఇంత బలమైన అనుబంధాన్ని కొనసాగిస్తూ, కళాశాల అభివృద్ధికి కృషి చేయడం అభినందనీయమన్నారు. నగరంలో భవిష్యత్తులో బహిరంగ ప్రదేశాలు తగ్గిపోయే పరిస్థితుల్లో కళాశాల ప్రాంగణం నగరానికి కీలకమైన గ్రీన్ లంగ్ స్పేస్‌గా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో, వాటిని సంరక్షించి బతికించడం అంతకంటే ముఖ్యమని కలెక్టర్ అన్నారు. ప్రస్తుతం నాటిన మొక్కలను కనీసం వచ్చే ఏడాది వరకు జాగ్రత్తగా సంరక్షిస్తే వాటి మనుగడ శాతం గణనీయంగా పెరుగుతుందని తెలిపారు. మొక్కలకు క్రమం తప్పకుండా నీరు అందించేందుకు సంబంధిత శాఖలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

కాకతీయ వైద్య కళాశాల వంటి విద్యాసంస్థల్లో పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలను నిరంతరం కొనసాగించాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను విద్యార్థులు, కళాశాల యాజమాన్యం తీసుకోవాలని అధికారులు సూచించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో వెయ్యికి పైగా మొక్కలను నాటారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు