సిరిసిల్ల, ఆగస్టు 1: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆపరేషన్ ముస్కాన్ విజయవంతంగా ముగిసింది. ప్రత్యేక తనిఖీల్లో జిల్లావ్యాప్తంగా 104 మంది బాలబాలికలను గుర్తించి సంరక్షణ కల్పించామని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. బాల కార్మికులతో పనిచేయిస్తున్న వారిపై 27 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.
జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక శాఖ, విద్యాశాఖ, జిల్లా బాలల సంరక్షణ విభాగం, రెవెన్యూ, వైద్య ఆరోగ్య శాఖలతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మొత్తం 104 మంది బాలబాలికలను గుర్తించి, వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఎదుట హాజరుపరిచారు. అనంతరం తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించి చిన్నారులను వారి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్పీ తెలిపారు.
అదేవిధంగా 18 ఏళ్లలోపు పిల్లలను పనిలో పెట్టుకుని పని చేయిస్తున్న యజమానులపై 27 కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. బాలల హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎస్పీ మహేష్ బి. గితే అన్నారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రజలు బాధ్యతాయుతంగా సహకరించాలని కోరారు. చిన్నారులతో పనులు చేయిస్తున్న వారిని గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, వీధి బాలలు కనిపించినా స్థానిక పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని సూచించారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతానికి సహకరించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.





















