హైదరాబాద్, ఆగస్టు 7 (జనవాణి): తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే డిజిటల్ అసెంబ్లీ, డిజిటల్ కౌన్సిల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రకటించారు. కృత్రిమ మేధ (ఏఐ), బ్లాక్‌చెయిన్, డేటా అనలిటిక్స్, క్వాంటం కంప్యూటింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలను పాలనలో విస్తృతంగా వినియోగించి ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
శుక్రవారం హైదరాబాద్‌లోని బేగంపేట ఐటీసీ కాకతీయలో గవ్‌కనెక్ట్ (GOVconnect), ఎలక్ట్రానిక్ సర్వీసెస్ డెలివరీ (మీసేవ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కాంక్లేవ్–తెలంగాణ' కార్యక్రమాన్ని మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ పాలనలోనూ మార్పులు తీసుకొస్తున్నామని చెప్పారు.
డిజిటల్ క్యాబినెట్, 20 ప్రభుత్వ శాఖలను ఒకే వేదికపై అనుసంధానించే రియల్‌టైమ్ గవర్నమెంట్ డ్యాష్‌బోర్డ్, దేశంలోనే తొలి ఏఐ ఆధారిత డేటా ఎక్స్ఛేంజ్, వాట్సాప్ ద్వారా పౌర సేవల అందజేత, 'మీ టికెట్' వంటి వినూత్న కార్యక్రమాలతో తెలంగాణ డిజిటల్ గవర్నెన్స్‌లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు.
పౌరుల డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం త్వరలోనే బ్లాక్‌చెయిన్ ఆధారిత సర్టిఫికెట్ల జారీని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. దీంతో ప్రభుత్వ ధ్రువపత్రాల భద్రత, పారదర్శకత మరింత పెరుగుతుందని తెలిపారు.
రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు టీ-ఫైబర్ ద్వారా హైస్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మంత్రి చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సేవలను నేరుగా వారి ఇంటి వద్దకే అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో డిజిటల్ ఆఫీస్ ప్రాజెక్ట్ ద్వారా పూర్తిస్థాయి పేపర్‌లెస్ పరిపాలన అమలు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మిత్రా సీఈవో ప్రవీణ్ పరదేశి, సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఎండీ జీవీఎల్ సత్యకుమార్, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా సీఈవో డాక్టర్ దేవేష్ త్యాగి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అదనపు కార్యదర్శి సౌరభ్ కె. తివారీ తదితరులు పాల్గొన్నారు.





















