హైదరాబాద్, ఆగస్టు 3: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు ఆదరణ పెరుగుతోంది. 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్టియర్‌లో 85,453 మంది విద్యార్థులు చేరారు. గత ఏడాది 75వేల మంది విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. అంటే ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలు దాదాపు 14 శాతం పెరిగాయి. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి 1,64,730 మంది విద్యార్థులు చదువుతున్నట్లుగా ఇంటర్ బోర్డు ఆ ప్రకటనలో తెలిపింది. విద్యార్థి సంక్షేమ కార్యక్రమాలు, ఆధునిక బోధనా విధానాలు, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రముఖ పరిశ్రమలతో అవగాహన ఒప్పందాలు, సమగ్ర శిక్ష నిధుల సమర్థ వినియోగం వంటి చర్యల వల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందని.. అందువల్లే అడ్మిషన్లు పెరిగాయని అధికారులు తెలిపారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యాలయంలో సోమవారం జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారులు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సమగ్ర శిక్ష నిధుల వినియోగం, ఎస్‌ఎన్‌ఏ–స్పార్ష్ పోర్టల్ ద్వారా ఆర్థిక నిర్వహణ, కార్యాలయాల్లో మహిళల భద్రతకు సంబంధించిన పోష్ చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం ఆ మీటింగ్‌కు సంబంధించిన వివరాలను ఒక ప్రకటనలో విడుదల చేశారు.
ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఐబీఎం, హెటెరో ఫార్మాస్యూటికల్స్ వంటి సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు విద్యాశాఖ ఆ అవగాహన సదస్సులో వెల్లడించింది. ఈ భాగస్వామ్యంతో డిజిటల్ నైపుణ్యాలు, సాంకేతిక శిక్షణ, ఇంటర్న్‌షిప్‌లు, క్యాంపస్ నియామకాల ద్వారా ఇప్పటివరకు 2 వేల మందికి పైగా విద్యార్థులు ప్లేస్‌మెంట్లు, అప్రెంటిస్ అవకాశాలు పొందినట్లు తెలిపింది. హెటెరో సంస్థ ఇంటర్ అర్హత కలిగిన 300 మందికి పైగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించింది.
ఎన్‌సీఈఆర్‌టీ తరహా సిలబస్
ఇంటర్మీడియట్ తొలి ఏడాది సిలబస్‌ను ఎన్‌సీఈఆర్‌టీ ప్రమాణాలకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించామని, క్యూఆర్ కోడ్‌లతో కూడిన స్మార్ట్ పాఠ్యపుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చామని అధికారులు తెలిపారు. వీటి ద్వారా విద్యార్థులు వీడియో పాఠాలు, డిజిటల్ అధ్యయన సామగ్రిని సులభంగా పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.1.9 కోట్లు, క్రీడా సామగ్రికి రూ.1.04 కోట్లు, ఎకో క్లబ్‌లకు రూ.10.45 లక్షలు, కంప్యూటర్ గదుల ఏర్పాటుకు రూ.20 కోట్లకు పైగా, గ్రంథాలయాలు, ప్రయోగశాలల అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేసినట్లు విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులకు ఉచిత యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, అల్పాహారం వంటి సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని పేర్కొంది.





















