న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12 (జనవాణి): న్యూఢిల్లీలో జరుగుతున్న 18వ బ్రిక్స్ సదస్సు-2026కు వచ్చే దేశాధినేతలు, ప్రముఖ అతిథుల కోసం జైపూర్‌కు చెందిన అరుణ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రత్యేక వెండి పూత పాత్రలను తయారు చేసింది. భారతీయ ఆతిథ్య సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా వీటిని రూపొందించారు.
వెండి గిన్నెలు, ట్రేలు, పళ్లాలు, సర్వింగ్ డిష్‌లతో పాటు ఆహారాన్ని వడ్డించేందుకు ఉపయోగించే పెద్ద అలంకరణ గిన్నెలు, మూతలతో కూడిన ప్రత్యేక పాత్రలను కూడా సిద్ధం చేశారు. సంప్రదాయ నగిషీ పనితనానికి ఆధునిక డిజైన్లను జోడించడం ఈ పాత్రల ప్రత్యేకత.
G20లోనూ సేవలు
అరుణ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ అరుణ్ పబువాల్ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రత్యేక పాత్రల తయారీ తమ సంస్థకు కొత్త కాదని తెలిపారు. 2023లో జరిగిన G20 సదస్సుతో పాటు పలు వీఐపీ కార్యక్రమాలు, విదేశీ అధ్యక్షుల పర్యటనల కోసం కూడా తమ సంస్థ పాత్రలను అందించిందని చెప్పారు. ప్రతి వంటకానికి ప్రత్యేక కాన్సెప్ట్‌తో డిజైన్లు రూపొందించినట్లు వెల్లడించారు. ఆధునిక, సంప్రదాయ శైలులను మేళవిస్తూ పాత్రలను తయారు చేసినట్లు తెలిపారు.
నాణ్యత విషయంలో రాజీ లేదు
ఇలాంటి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు ఉత్పత్తులను అందించడంలో నాణ్యతే తమ ప్రధాన బలం అని సంస్థ ప్రతినిధులు తెలిపారు. బేస్ మెటీరియల్, డిజైన్, ప్లేటింగ్ విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. పాత్రల తయారీ, ఫినిషింగ్ ప్రక్రియలో మొత్తం పది దశలను అనుసరిస్తామని, ప్లేటింగ్ పూర్తయిన తర్వాత కూడా తుది ఫినిషింగ్ చేసి వాటిని కార్యక్రమానికి పంపిస్తామని వివరించారు. పాత్రల బరువు, వెండి పూత నాణ్యత, ఫినిషింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలిపారు.
భారత్ అధ్యక్షతన BRICS సదస్సు
2026 సంవత్సరానికి భారత్ అధ్యక్షతన సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ సదస్సు జరుగుతోంది. “స్థిరత్వం, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం” అనే థీమ్‌తో భారత్ ఈ సదస్సుకు నాయకత్వం వహిస్తోంది. అభివృద్ధి, సుస్థిరత, ఆవిష్కరణలు, ఫైనాన్స్, టెక్నాలజీ, వాణిజ్యం, ప్రజల మధ్య సంబంధాలు వంటి అంశాలు సదస్సులో కీలకంగా చర్చకు రానున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాల కోసం BRICS కీలక వేదికగా కొనసాగుతోంది.
ప్రస్తుతం BRICSలో 11 సభ్య దేశాలు ఉన్నాయి. భారత్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియా, ఇరాన్, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, యూఏఈ ఇందులో సభ్యులుగా ఉన్నాయి. వీటితో పాటు నైజీరియా, బెలారస్, బొలీవియా, క్యూబా, కజకిస్థాన్, మలేషియా, థాయ్‌లాండ్, ఉగాండా, ఉజ్బెకిస్థాన్, వియత్నాం భాగస్వామ్య దేశాలుగా ఉన్నాయి.





















