మమతా బెనర్జీ ఇంట తీవ్ర విషాదం.. మేనకోడలు బ్రిష్టీ ముఖర్జీ బలవన్మరణం

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మేనకోడలు బ్రిష్టీ ముఖర్జీ ఘటక్ (28) బలవన్మరణానికి పాల్పడ్డారు. బీర్భూమ్ జిల్లా రాంపూర్‌హాట్‌లోని తన నివాసంలో మంగళవారం మధ్యాహ్నం ఆమె మృతదేహం లభ్యమైంది.

1 సెప్టెంబర్, 2026 5:31 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మమతా బెనర్జీ ఇంట తీవ్ర విషాదం.. మేనకోడలు బ్రిష్టీ ముఖర్జీ బలవన్మరణం

Social Media Image

ప‌శ్చిమ బెంగాల్, సెప్టెంబర్ 01 (జనవాణి): పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె మేనకోడలు బ్రిష్టీ ముఖర్జీ ఘటక్ (28) బలవన్మరణానికి పాల్పడ్డారు. బీర్భూమ్ జిల్లా రాంపూర్‌హాట్‌లోని తన నివాసంలో మంగళవారం మధ్యాహ్నం ఆమె మృతదేహం లభ్యమైంది. బ్రిష్టీ బోల్‌పుర్ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లో నాన్‌ టీచింగ్ సిబ్బందిగా పనిచేశారు. అయితే పశ్చిమ బెంగాల్‌లో వెలుగుచూసిన టీచర్ రిక్రూట్‌మెంట్ అవకతవకల కేసు ఆమె జీవితంపైనా ప్రభావం చూపింది. అక్రమ నియామకాలు జరిగినట్లు నిర్ధారణ కావడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వేలాది మంది టీచింగ్, నాన్‌ టీచింగ్ సిబ్బంది ఉద్యోగాలు రద్దయ్యాయి. అందులో బ్రిష్టీ కూడా ఉన్నారు.

ఉద్యోగం కోల్పోవడంతో తీవ్ర ఒత్తిడి

ఉద్యోగం కోల్పోవడంతో పాటు భర్తతో విడాకుల సమస్యలు కూడా బ్రిష్టీని తీవ్ర మానసిక ఒత్తిడికి గురిచేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మానసిక ఆరోగ్య సమస్యలకు చికిత్స తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే ఆమె ఇంట్లో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బ్రిష్టీ మృతికి దారితీసిన పూర్తి కారణాలు పోస్టుమార్టం నివేదిక, పోలీసుల దర్యాప్తులో వెల్లడవుతాయని అధికారులు తెలిపారు.

అసలు ఏమిటీ టీచర్ రిక్రూట్‌మెంట్‌ కేసు?

పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో 9 నుంచి 12 తరగతులకు ఉపాధ్యాయులు, అలాగే గ్రూప్‌ సీ, గ్రూప్‌ డీ సిబ్బంది నియామకాల కోసం 2016లో రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష నిర్వహించారు. సుమారు 23 లక్షల మందికి పైగా అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. తొలుత 24,650 ఖాళీల భర్తీకి ప్రక్రియ చేపట్టగా.. చివరకు 25,753 మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్లు జారీ చేయడం వివాదానికి దారితీసింది. అదనపు పోస్టులను సృష్టించి అక్రమంగా నియామకాలు చేపట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ వ్యవహారంపై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు.. 2016 నాటి నియామక ప్రక్రియను రద్దు చేస్తూ 2024 ఏప్రిల్‌ 22న తీర్పు ఇచ్చింది. అవకతవకలపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడా ప్రభుత్వానికి ఊరట లభించలేదు. సుప్రీంకోర్టు సైతం 25,753 మంది నియామకాలను చెల్లవని తేల్చడంతో ప్రభుత్వం ఆ నియామకాలను రద్దు చేసింది. ఫలితంగా వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. వారిలో బ్రిష్టీ ముఖర్జీ కూడా ఒకరు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు