నేపాల్: నేపాల్‌లో భారీ వరదలు, ఆకస్మిక మెరుపు వరదలు కైలాస మానససరోవర యాత్రికులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. మాజీ కేంద్ర మంత్రి ముకుల్ రాయ్ కోడలు, తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శుభ్రాన్షు రాయ్ భార్య శర్మిష్ట భౌమిక్ రాయ్ గల్లంతయ్యారు.
శర్మిష్ట కోల్‌కతాకు చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా కైలాస మానససరోవర యాత్రకు వెళ్లారు. ఆగస్టు 21న ఆమె నేపాల్ చేరుకున్నారు. ఆగస్టు 25న రాత్రి 11:30 గంటల సమయంలో భర్త శుభ్రాన్షు రాయ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తాను టిబెట్ సరిహద్దుకు సమీపంలోని కైరోంగ్ ప్రాంతంలో ఉన్నట్లు ఆయనకు తెలిపారు. అయితే బుధవారం ఉదయం నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో భారీగా మెరుపు వరదలు సంభవించాయి. ఆ తర్వాత శర్మిష్టతో కుటుంబసభ్యులకు పూర్తిగా సంబంధాలు తెగిపోయాయి. ఆమె పేరు మిస్సింగ్ లిస్ట్‌లో ఉన్నట్లు భర్త శుభ్రాన్షు రాయ్ ధ్రువీకరించారు. శర్మిష్టతో పాటు అదే యాత్రా బృందంలో ఉన్న కోల్‌కతాకు చెందిన మరో 32 మంది యాత్రికుల ఆచూకీ కూడా తెలియడం లేదు. దీంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. గల్లంతైన వారి వివరాలు, ప్రస్తుత పరిస్థితిపై సమాచారం కోసం కుటుంబసభ్యులు భారత రాయబార కార్యాలయం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని సంప్రదించారు. యాత్రికుల ఆచూకీ కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.




















