మమతా బెనర్జీ కాన్వాయ్‌పై దాడి.. బురద, రాళ్లు, చెప్పులతో నిరసన

పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హలిశహర్‌లో మమతా బెనర్జీ కాన్వాయ్‌ను నిరసనకారులు అడ్డుకున్నారు. తన వాహనంపై బురద, రాళ్లు, చెప్పులు విసిరారని మమతా ఆరోపించగా.. ఈ ఘటన వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ మాత్రం ఈ ఘటనతో తమకు సంబంధం లేదని స్పష్టం చేసింది.

9 ఆగస్టు, 2026 9:38 PM•ByNarender Kumar Nangunoori

Share this article

మమతా బెనర్జీ కాన్వాయ్‌పై దాడి.. బురద, రాళ్లు, చెప్పులతో నిరసన

Social Media Image

కోల్‌కతా, ఆగస్టు 09 (జనవాణి): పశ్చిమ బెంగాల్‌లో మరోసారి తీవ్ర రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. మాజీ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌ను ఉత్తర 24 పరగణాల జిల్లాలోని హలిశహర్‌లో నిరసనకారులు అడ్డుకున్నారు. పోలీస్ కస్టడీలో మృతి చెందిన టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మమతా బెనర్జీ వాహనాన్ని నిరసనకారులు చుట్టుముట్టి వ్యతిరేకంగా నినాదాలు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత తన వాహనంపై బురద, రాళ్లు, చెప్పులు, ఇతర వస్తువులు విసిరారని మమతా ఆరోపించారు.

దాడి వెనుక కుట్ర ఉంది

ఈ ఘటనపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం, ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల కళ్లెదుటే బయటి నుంచి వచ్చిన సంఘవిద్రోహ శక్తులు నా కారుపై దాడి చేశారు. పెద్దపెద్ద రాళ్లు, ఇటుకలు, బురద విసిరారు. కారు అద్దాలు తెరిచి ఉంటే తీవ్రంగా గాయపడే అవకాశం ఉండేదని వ్యాఖ్యానించారు. తన పర్యటన గురించి పోలీసులకు ముందుగానే సమాచారం ఉన్నప్పటికీ తగిన భద్రత కల్పించలేదని విమర్శించారు. ఈ ఘటన వెనుక కుట్ర ఉందని అనుమానం వ్యక్తం చేసిన మమతా.. బెంగాల్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి మమతా కాన్వాయ్‌ను అక్కడి నుంచి సురక్షితంగా తరలించారు. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ సైతం ఘటనను తీవ్రంగా ఖండించారు. మమతా బెనర్జీని లక్ష్యంగా చేసుకుని రాళ్లు విసరడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. దీనిని హత్యాయత్నంగా పరిగణించాలని డిమాండ్ చేశారు.

దాడిని బీజేపీ సమర్థించదు ఈ హింసాకాండతో తమకు ఎలాంటి సంబంధం లేదని పార్టీ అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య స్పష్టం చేశారు.మమతా బెనర్జీ కాన్వాయ్‌పై దాడిని బీజేపీ ఖండించింది. రాళ్లు, బురద, చెప్పులు విసరడం వంటి చర్యలను తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించదని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తెలిపారు. ఈ హింసాకాండతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలు రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీస్తాయని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. బీజేపీ నేత, మంత్రి అగ్నిమిత్ర పాల్ కూడా దాడిని ఖండించారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం తమ రాజకీయ సంస్కృతిలో లేదని స్పష్టం చేశారు.

కార్యకర్త మృతి తర్వాత వివాదం

టీఎంసీ కార్యకర్త బిర్జు కియోట్ పోలీస్ కస్టడీలో మృతి చెందడం ఈ వివాదానికి ప్రధాన కారణంగా మారింది. అవినీతి, వసూళ్ల ఆరోపణలపై పోలీసులు కియోట్‌ను అరెస్టు చేసినట్లు సమాచారం. కస్టడీలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించగా అక్కడ మృతి చెందినట్లు తెలుస్తోంది. కియోట్ మృతికి గుండెపోటే కారణమని పోలీసులు చెబుతున్నప్పటికీ.. కుటుంబ సభ్యులు మాత్రం పోలీసుల దాడి కారణంగానే ఆయన మరణించారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

కియోట్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మమతా బెనర్జీ హలిశహర్‌కు వెళ్లగా.. ఆమె కుటుంబ సభ్యులను కలవకముందే కాన్వాయ్‌ను నిరసనకారులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాగా, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ ఘోర పరాజయం తర్వాత మమతా మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీపైనా దాడి జరిగింది. నెలల వ్యవధిలోనే టీఎంసీ అధినేత్రిపైనా దాడి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. మొత్తంగా ఈ ఘటనతో బెంగాల్‌లో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య రాజకీయ మాటల యుద్ధం మరింత ముదిరింది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు