Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ శాసనసభలో ఎమ్మెల్యేలకు భారీ ప్రయోజనాలను ప్రకటించారు. రాష్ట్రంలోని మొత్తం 234 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వం తరఫున అధికారిక వాహనాలను కేటాయించనున్నట్లు తెలిపారు. దీంతో పాటు వాహనానికి సంబంధించిన డ్రైవర్, ఇంధనం, నిర్వహణ ఖర్చుల కోసం నెలకు రూ.75 వేల అలవెన్స్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా వ్యక్తిగత కార్యదర్శిని నియమించుకునేందుకు మరో రూ.25 వేల ప్రభుత్వ గ్రాంట్ అందించనున్నట్లు సీఎం తెలిపారు. అంటే ఎమ్మెల్యేలకు నెలకు మొత్తం రూ.లక్ష వరకు అదనపు అలవెన్స్ అందనుంది.
ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు విస్తృతంగా పర్యటించాల్సి ఉంటుందని విజయ్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి తొలిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని చెప్పారు. వీసీకే ఎమ్మెల్యే జోషిమణి చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం వివరించారు. ‘ప్రజల సమస్యలను వినడానికి, ప్రభుత్వ ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉంటుంది. ఆర్థిక అండ లేని సభ్యులు, తొలిసారి ఎన్నికైన వారు తమ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించేందుకు ప్రభుత్వ వాహనాలు అందిస్తున్నాం’ అని తెలిపారు.
ప్రభుత్వ నిర్ణయంపై అధికారపక్ష ఎమ్మెల్యేలు హర్షం వ్యక్తం చేశారు. టీవీకే ఎమ్మెల్యే సింధు ఎంజీఆర్ సినిమాలోని పాట పాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరో టీవీకే ఎమ్మెల్యే శబరి అయ్యంగారన్ తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకున్నారు. ‘గతంలో నాకు కారు గానీ, ఉద్యోగం గానీ లేదు. ఇప్పుడు మా నాయకుడు మాకు ఉద్యోగాలు, కార్లు ఇచ్చారు. చెన్నైకి రైలులోనే వస్తాను. అసెంబ్లీకి ఆటోలో వచ్చినప్పుడు నేను ఎమ్మెల్యేనని చెబితే పోలీసులు నమ్మరు.. గుర్తింపు కార్డు చూపించాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు.
అయితే సీఎం విజయ్ ప్రకటనపై ప్రధాన ప్రతిపక్షం డీఎంకే తీవ్రంగా స్పందించింది. 234 మంది ఎమ్మెల్యేలకు ప్రభుత్వ వాహనాలతో పాటు నెలకు రూ.లక్ష వరకు అలవెన్స్ ఇవ్వడం ప్రజాధనాన్ని వృథా చేయడమేనని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఏ. శరవణన్ విమర్శించారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఖజానాపై అదనపు భారం పడుతుందని ప్రతిపక్షం ఆరోపించింది.




















