మహారాష్ట్రలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఈ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు పోలీసు శిక్షణ అనంతరం పింప్రి-చించ్‌వాడ్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విధుల్లో చేరారు. కొంతకాలం ఇతర మహిళా కానిస్టేబుళ్లతో కలిసి నివసించిన అనంతరం వీరిద్దరూ ఒకే పోలీసు స్టేషన్‌కు బదిలీ అయ్యారు. మిగిలిన ఇద్దరు వేరే చోటుకు వెళ్లిన తర్వాత కూడా వీరిద్దరూ కలిసి ఉంటున్నట్లు సమాచారం. కాలక్రమంలో వీరి సాన్నిహిత్యం సన్నిహితుల దృష్టికి వచ్చింది. గత మూడేళ్లుగా ఒకే చోట విధులు నిర్వహిస్తూ సన్నిహితంగా మారినట్లు సమాచారం. కాలక్రమంలో వీరి సాన్నిహిత్యం కుటుంబ సభ్యులు, సన్నిహితుల దృష్టికి వచ్చినట్లు సమాచారం.
సెలవు దరఖాస్తుతో వెలుగులోకి..
ఈ నెల 30న వివాహం చేసుకునేందుకు సిద్ధమైన ఇద్దరు కానిస్టేబుళ్లు ఇందుకోసం ఉన్నతాధికారులకు సెలవు దరఖాస్తు చేసుకున్నారు. దానికి ముద్రించిన వివాహ ఆహ్వాన పత్రికను కూడా జత చేసినట్లు తెలుస్తోంది. దీంతో విషయం పోలీసు కమిషనరేట్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే వీరిలో ఒకరి కుటుంబ సభ్యులు వివాహ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లు సమాచారం. గతంలో పోలీసు స్టేషన్‌కు వెళ్లి సిబ్బందిని ఈ విషయమై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం వ్యక్తిగతమైనదని, దీనిపై చర్చించవద్దని ఉన్నతాధికారులు సిబ్బందికి సూచించినట్లు సమాచారం.
కుటుంబ సభ్యుల ఫిర్యాదుపై పోలీసుల స్పందన
వివాహ తేదీ దగ్గరపడటంతో కుటుంబ సభ్యులు పింప్రి-చించ్‌వాడ్ పోలీసు కమిషనరేట్‌లోని ఓ ఉన్నతాధికారిని కలిసి జోక్యం చేసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరూ వయోజనులైనందున, పరస్పర అంగీకారంతో కొనసాగుతున్న సంబంధాన్ని అడ్డుకోలేమని అధికారి స్పష్టం చేసినట్లు సమాచారం. అవసరమైతే కౌన్సెలింగ్ అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది.
పెళ్లికి చట్టబద్ధ గుర్తింపు ఉంటుందా?
ఇద్దరూ ఆలందిలో సంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుక నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే ఈ వివాహానికి చట్టబద్ధ హోదా లభిస్తుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. భారత్‌లో వయోజనుల మధ్య పరస్పర సమ్మతితో కూడిన స్వలింగ సంబంధాలు నేరం కావు. అయితే ప్రస్తుత చట్టాల ప్రకారం స్వలింగ జంటల వివాహాలకు ప్రత్యేకంగా చట్టబద్ధ గుర్తింపు లేదు. 2023లో సుప్రీంకోర్టు స్వలింగ వివాహాలను చట్టబద్ధం చేయడంపై నిర్ణయం తీసుకునే అధికారం పార్లమెంట్ పరిధిలో ఉందని స్పష్టం చేసింది. అదే సమయంలో భాగస్వామిని ఎంచుకునే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలను కోర్టు సమర్థించింది.
లింగమార్పిడి చికిత్సపైనా చర్చ
ఈ వ్యవహారంలో లింగమార్పిడి అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇద్దరు కానిస్టేబుళ్లలో ఒకరు లింగమార్పిడి చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇందుకోసం ముంబయిలోని ఓ ప్రముఖ ఆసుపత్రిని పలుమార్లు సందర్శించినట్లు తెలుస్తోంది. లింగమార్పిడి ప్రక్రియ పూర్తయిన తర్వాత వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేసుకునే అవకాశం ఉందా? అనే అంశాన్ని కూడా ఇద్దరూ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనిపై వర్తించే చట్టాలు, అధికారిక లింగ గుర్తింపు, వివాహ నమోదు నిబంధనలు వంటి అంశాలు కీలకం కానున్నాయి.
మరో పోలీసు ఉద్యోగి విషయంలోనూ..
పింప్రి-చించ్‌వాడ్ పోలీసు కమిషనరేట్‌లో లింగమార్పిడికి సంబంధించిన మరో వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. బదిలీల్లో భాగంగా బీడ్ నుంచి ఓ పోలీసు ఉద్యోగిని కమిషనరేట్‌కు బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ప్రభుత్వ అనుమతితో లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు సమాచారం. చికిత్స అనంతరం సర్వీస్ రికార్డుల్లో జెండర్‌ను మార్చాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ దరఖాస్తు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఉద్యోగంలో చేరిన సమయంలో మహిళలకు వర్తించిన రాయితీలు, ఇతర ప్రయోజనాలపై కూడా అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల వివాహ నిర్ణయం, మరో పోలీసు ఉద్యోగి జెండర్ మార్పు దరఖాస్తు వేర్వేరు వ్యవహారాలే అయినప్పటికీ.. వ్యక్తిగత స్వేచ్ఛ, లింగ గుర్తింపు, సర్వీస్ రికార్డుల మార్పు, స్వలింగ వివాహాల చట్టబద్ధత వంటి అంశాలపై పింప్రి-చించ్‌వాడ్ పోలీసు కమిషనరేట్‌లో చర్చకు దారితీశాయి.




















