నేపాల్‌లో భారీ ఆకస్మిక వరదల ప్రళయం.. 384 మంది గల్లంతు.. 105 మంది భారతీయులు!

నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటేకోషి నదిలో సంభవించిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు నేపాల్ టూరిజం బోర్డు ప్రాథమికంగా వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉండగా.. విదేశీయుల్లో సుమారు 105 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది.

26 ఆగస్టు, 2026 6:26 PM•ByVijay Kumar

Share this article

నేపాల్‌లో భారీ ఆకస్మిక వరదల ప్రళయం.. 384 మంది గల్లంతు.. 105 మంది భారతీయులు!

నేపాల్‌ కాఠ్మాండు August 26(జనవాణి): నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటేకోషి నదిలో సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. బుధవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయంలో వచ్చిన భారీ వరదలతో నది పరివాహక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాల్లో భారీగా నష్టం వాటిల్లినట్లు సమాచారం.

384 మంది గల్లంతు

ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రభావిత ప్రాంతాల్లో 384 మంది ప్రయాణికులు గల్లంతైనట్లు నేపాల్ టూరిజం బోర్డు (NTB) వెల్లడించింది. వీరిలో 291 మంది విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉన్నారు. విదేశీయుల్లో సుమారు 105 మంది భారతీయులు ఉన్నట్లు తెలిపింది. అలాగే హిమాలయన్ గ్లేసియర్ ప్రాంతంలో 37 మంది ఎన్నారైలు కూడా గల్లంతైనట్లు ప్రాథమిక జాబితాలో పేర్కొంది.

ఈ వివరాలను పర్యాటక, ట్రావెల్ సంస్థల నుంచి అందిన ప్రాథమిక సమాచారం ఆధారంగా రూపొందించినట్లు NTB తెలిపింది. ట్రావెల్ ఏజెన్సీలు, గైడ్లు, స్థానిక అధికారులు, భద్రతా సంస్థలతో సమన్వయం చేసుకుంటూ గల్లంతైన వారి ఆచూకీ, క్షేమ సమాచారాన్ని నిర్ధారిస్తున్నట్లు పేర్కొంది.

ఏడుగురు మృతి.. 25 మంది రక్షణ

స్థానిక నివేదికల ప్రకారం వరదల్లో ఇప్పటివరకు కనీసం ఏడుగురు మృతి చెందినట్లు సమాచారం. నది పరివాహక ప్రాంతంలో భారీగా విధ్వంసం జరిగింది. సహాయక చర్యల్లో భాగంగా బుధవారం మధ్యాహ్నం నాటికి కనీసం 25 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు.

14 హెలికాప్టర్లతో గాలింపు

నేపాల్ ఆర్మీ, పోలీసులు, ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్ (APF) సిబ్బంది భారీగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. గల్లంతైన వారి కోసం 14 హెలికాప్టర్లను రంగంలోకి దించి గాలింపు, సహాయక చర్యలు చేపట్టారు. నేపాల్-చైనా సరిహద్దు సమీపంలోని టిమురేలో విధుల్లో ఉన్న తొమ్మిది మంది APF సిబ్బంది కూడా గల్లంతైనట్లు సమాచారం.

భారతీయుల కోసం అత్యవసర నంబర్లు

వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర సంప్రదింపు నంబర్లను ప్రకటించింది. సహాయం లేదా సమాచారం కోసం +977 985 131 6807, +977 970 910 7500 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

అదేవిధంగా నేపాల్ టూరిజం బోర్డు 1234 టోల్‌ఫ్రీ నంబర్‌, 1144 హాట్‌లైన్‌, టూరిస్ట్ పోలీస్ నంబర్‌ 9851289445లను సంప్రదించాలని సూచించింది. పర్యాటకులు ఆందోళన చెందకుండా అధికారిక భద్రతా సూచనలు పాటించాలని కోరింది.

నేపాల్ ప్రధానికి మోదీ ఫోన్

భారీ వరదల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ ప్రధాని బాలేంద్ర షాతో మాట్లాడారు. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు. ఈ కష్టకాలంలో నేపాల్ ప్రజలకు భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

నేపాల్‌కు అవసరమైన అన్ని రకాల మానవతా, సహాయక చర్యలను అందించేందుకు భారత్ సిద్ధంగా ఉందని మోదీ తెలిపారు. రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాల కోసం ఇరు దేశాల బృందాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

మరోవైపు రసువా జిల్లాలో పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గల్లంతైన వారి వివరాలను నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.


Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు