అమెరికా చదువుల కలపై కొత్త భారం?
అమెరికాలో చదివిన తర్వాత అక్కడే ఉద్యోగ అనుభవం సంపాదించాలని భావించే విద్యార్థులకు ఓపీటీ కీలక అవకాశంగా ఉంటుంది. అయితే ఈ అవకాశానికే లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదన వెలుగులోకి రావడంతో భారతీయ విద్యార్థులతో పాటు ప్రపంచవ్యాప్తంగా విదేశీ విద్యార్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదన అమలైతే అమెరికాలో చదవాలనే నిర్ణయాన్నే చాలామంది పునఃపరిశీలించే పరిస్థితి రావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
ఓపీటీ అంటే ఏమిటి?
ఎఫ్-1 స్టూడెంట్ వీసాపై అమెరికాలో చదివే విదేశీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ అనంతరం తమ చదివిన రంగంలో ఉద్యోగ అనుభవం పొందేందుకు అమెరికా ప్రభుత్వం Optional Practical Training (OPT) అవకాశం కల్పిస్తోంది.
సాధారణంగా గ్రాడ్యుయేట్లు ఏడాది పాటు పని చేయవచ్చు. అయితే సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితశాస్త్రం (STEM) కోర్సులు పూర్తి చేసిన వారికి అదనంగా మరో రెండేళ్ల పొడిగింపు లభిస్తుంది. అంటే మొత్తం మూడేళ్ల వరకు అమెరికాలో ఉద్యోగ అనుభవం సంపాదించే అవకాశం ఉంటుంది.
హెచ్-1బీకి ఇదే ప్రధాన మార్గం
భారత్ నుంచి బీటెక్ లేదా సమాన అర్హతలతో అమెరికాకు వెళ్లి ఎంఎస్ పూర్తి చేసే విద్యార్థుల్లో చాలా మంది ఓపీటీ ద్వారా ఉద్యోగం సంపాదిస్తారు. అదే సమయంలో హెచ్-1బీ వీసాకు దరఖాస్తు చేసుకుని దీర్ఘకాలిక ఉద్యోగ అవకాశాలను పొందుతున్నారు. అందుకే ఓపీటీని అమెరికాలో కెరీర్‌కు తొలి మెట్టుగా భావిస్తారు.
ట్రంప్ లక్ష్యం ఏమిటి?
విదేశీ ఉద్యోగులపై ఆధారపడకుండా అమెరికా కంపెనీలు స్థానిక అమెరికన్లకే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం గతంలో కూడా హెచ్-1బీ వీసాలపై భారీ ఫీజు ప్రతిపాదించింది. అయితే ఆ నిర్ణయాన్ని ఫెడరల్ కోర్టు నిలిపివేసింది.
ఇప్పుడు అదే తరహాలో ఓపీటీపై భారీ ఫీజు ప్రతిపాదనను పరిశీలించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇది అమలైతే అమెరికాలో చదివి ఉద్యోగం చేయాలనుకునే విదేశీ విద్యార్థులపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది
అమల్లోకి వస్తుందా?
ప్రస్తుతం ఇది కేవలం ప్రతిపాదన దశలోనే ఉన్నట్లు అమెరికా మీడియా కథనాలు పేర్కొన్నాయి. అధికారికంగా అమల్లోకి రావాలంటే సంబంధిత విధానపరమైన, చట్టపరమైన ప్రక్రియలు పూర్తికావాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఈ వార్త అమెరికాలో చదువుకోవాలని భావిస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది.




















