హైదరాబాద్, ఆగస్టు 14 (జనవాణి): అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. గల్ఫ్ దేశం యూఏఈ తీసుకున్నట్లు చెబుతున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌కు యూఏఈ నుంచి ఏకంగా 2 టన్నుల బంగారం, 3 బిలియన్ డాలర్ల నగదు చేరినట్లు సమాచారం! యూఏఈ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయడంతో ఈ భారీ బదిలీ జరిగినట్లు ఇరాన్‌కు చెందిన వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొంటున్నాయి. ఇరాన్ నుంచి తమ దేశంపై ప్రతీకార దాడులు జరగకుండా చూసుకునే వ్యూహంలో భాగంగానే అబుదాబి ఈ చర్యలు చేపట్టిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై యూఏఈ నుంచి అధికారిక ధ్రువీకరణ వెలువడలేదు.
2 టన్నుల బంగారం.. విలువ రూ.2,500 కోట్లకు పైగా!
యూఏఈ నుంచి ఇరాన్‌కు బదిలీ అయినట్లు చెబుతున్న బంగారం మొత్తం 2 టన్నులు. దీని విలువ సుమారు 283 మిలియన్ డాలర్లుగా అంచనా. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2,500 కోట్లకు పైమాటే. అమెరికా ఆంక్షలతో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న ఇరాన్‌కు ఈ బంగారం, ఆస్తుల విడుదల కీలకంగా మారనుంది.
3 బిలియన్ డాలర్ల నగదు ఎక్కడి నుంచి?
ఇరాన్ అధికారులను ఉటంకిస్తూ వెలువడిన వివరాల ప్రకారం.. జూన్ 8న అబుదాబి నుంచి టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయానికి వెళ్లిన విమానం ద్వారా సుమారు 3 బిలియన్ డాలర్లు ఇరాన్‌కు బదిలీ అయినట్లు సమాచారం. ఈ మొత్తం యూఏఈ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల్లో భాగమేనని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఇదే తరహాలో ఆగస్టు 11, 12 తేదీల్లోనూ అబుదాబి నుంచి ఇరాన్‌కు విమానాలు రాకపోకలు సాగించినట్లు సమాచారం. దీంతో తాజాగా మరిన్ని ఆస్తులు, బంగారం ఇరాన్‌కు చేరినట్లు కథనాలు వెలువడ్డాయి.
బంగారం.. నగదు వెనుక అసలు కారణం?
అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణ ముదిరితే.. ఇరాన్ నుంచి తమపై దాడులు జరిగే ప్రమాదం యూఏఈకి ఉంది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌తో దౌత్యపరమైన సంబంధాలను కొనసాగిస్తూ.. తమ భూభాగాన్ని లక్ష్యంగా చేసుకోకుండా చూసుకునేందుకు యూఏఈ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఇరాన్‌కు చెందిన స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయడం, బంగారం అందించడం వంటి చర్యలు చేపట్టిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బంగారంతో ఆగలేదు.. విమానాలూ!
ఇరాన్‌కు ఆర్థిక సహాయం అందించడమే కాకుండా.. ఆ దేశ విమానయాన రంగానికి కూడా యూఏఈ సహకరిస్తున్నట్లు సమాచారం. ఇరాన్ విమానయాన సంస్థలకు15 పాత ప్రయాణికుల విమానాల విక్రయానికి యూఏఈ అనుమతించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కొన్ని ఎయిర్‌బస్ ఏ320 విమానాలు ఇరాన్‌కు చేరినట్లు సమాచారం.
అమెరికాతో స్నేహం.. ఇరాన్‌తో రాజీ?
యూఏఈ ఒకవైపు అమెరికాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూనే.. మరోవైపు ఇరాన్‌ను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తోందా? అన్న చర్చ మొదలైంది. 2 టన్నుల బంగారం.. 3 బిలియన్ డాలర్ల నగదు.. 15 విమానాలు! ఇవన్నీ ఒకేసారి తెరపైకి రావడంతో యూఏఈ వ్యూహంపై ఆసక్తి పెరిగింది. ఇరాన్ ప్రతీకార దాడుల నుంచి తప్పించుకునేందుకు ఆ దేశంతో తెరవెనుక ఒప్పందాలు చేసుకుంటోందా? లేక స్తంభింపజేసిన ఆస్తులనే తిరిగి విడుదల చేస్తోందా? అనేది మాత్రం అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.





















