నేపాల్, సెప్టెంబర్ 04 (జనవాణి): నేపాల్‌లో వరదల కారణంగా టన్నెల్స్‌లో చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో త్రిశూలీ త్రీఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ టన్నెల్ నుంచి ఇద్దరు సిబ్బందిని రెస్క్యూ బృందాలు సురక్షితంగా బయటకు తీశాయి.
నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి చెందిన 30 ఏళ్ల మెకానికల్ ఫోర్‌మ్యాన్ షా, త్రిశూలీ త్రీఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్‌కు చెందిన 45 ఏళ్ల సూపర్‌వైజర్ అమిర్ మహర్జన్ 9 రోజుల పాటు టన్నెల్‌లో చిక్కుకుపోయారు. వరదలతో భారీగా బురద చేరడంతో వారు టన్నెల్‌లోనే చిక్కుకున్నారు. తాజాగా రెస్క్యూ సిబ్బంది వారిని గుర్తించి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. బయటకు వచ్చే సమయానికి ఇద్దరి చేతులు, కాళ్లకు గాయాలైనట్లు అధికారులు తెలిపారు. టన్నెల్‌లో పాకుతూ బయటకు రావాల్సి రావడంతో ఈ గాయాలు అయి ఉండొచ్చని వెల్లడించారు.

ఇదిలా ఉంటే.. నేపాల్‌లోని 12 హైడ్రోపవర్ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న సుమారు 900 మంది వరదల్లో గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దాదాపు 500 మంది టన్నెల్స్‌లో చిక్కుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. త్రిశూలీ త్రీఏ ప్రాజెక్ట్ టన్నెల్ నుంచి ఇద్దరు సిబ్బంది 9 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడటంతో.. మిగిలిన వారు కూడా సురక్షితంగా ఉండే అవకాశం ఉందన్న ఆశలు అధికారుల్లో చిగురించాయి. టన్నెల్స్‌లో చిక్కుకున్న వారిని గుర్తించి బయటకు తీసేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశాయి. అమిర్ మహర్జన్ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. తన సోదరుడు ప్రాణాలతో బయటపడటంపై తీవ్ర ఆనందం వ్యక్తం చేశాడు. నాకెంతో సంతోషంగా ఉంది అంటూ భావోద్వేగానికి గురయ్యాడు.
Loading Tweet...




















