గోల్కొండ బోనాల ఉత్సవాలకు ఘన ముగింపు.. మహాకుంభహారతితో అమ్మవారికి వీడ్కోలు

జూలై 16న గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన ఆషాడ బోనాల ఉత్సవాలు, ఆగస్టు 13న మహాకుంభహారతితో సంప్రదాయబద్ధంగా ఘనంగా ముగిశాయి. మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధల మధ్య ఉత్సవాల ముగింపు కార్యక్రమం జరిగింది.

13 ఆగస్టు, 2026 9:27 PM•ByNarender Kumar Nangunoori

Share this article

గోల్కొండ బోనాల ఉత్సవాలకు ఘన ముగింపు.. మహాకుంభహారతితో అమ్మవారికి వీడ్కోలు

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల మహోత్సవం భక్తిశ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో విజయవంతంగా ముగిసిందని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ అన్నారు. జూలై 16న గోల్కొండ కోట జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనంతో ప్రారంభమైన బోనాల మహోత్సవం, తిరిగి ఈ రోజు (ఆగస్టు13) జగదాంబిక అమ్మవారికి మహాకుంభహారతితో సంప్రదాయబద్ధంగా ముగిసిందని మంత్రి స్పష్టం చేశారు. దాదాపు నెలరోజుల పాటు వైభవోపేతంగా జరిగిన బోనాల వేడుకలు శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, జానపద కళల ప్రదర్శన, అంబారీల ఊరేగింపు, రంగం, ఘటోత్సవాలతో తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల వైభవాన్ని చాటుతూ ఘనంగా జరిగాయని అన్నారు.

బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖల సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేసిందని మంత్రి తెలిపారు. రూ.20 కోట్ల నిధులతో ఆషాడ బోనాల జాతరను దేదీప్యమానంగా నిర్వహించామని అన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాల్లో వేలాది ఆలయాల్లో జరిగిన బోనాల వేడుకలు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా జరిగేందుకు పోలీసులు, జిహెచ్ఎంసి, పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌, వైద్యారోగ్యం, ట్రాఫిక్‌ నియంత్రణ, జలమండలి తదితర శాఖలతో సమన్వయంతో పనిచేసి జాతరను నిర్వహించిన తీరు అద్భుతమని మంత్రి సురేఖ అన్నారు. అన్ని శాఖల అధికారులకు ఈ సందర్భంగా పేరుపేరునా మంత్రి సురేఖ అభినందనలు తెలిపారు. పలు స్వచ్ఛంద సంస్థలు అందించిన సహకారం కూడా మరువలేనిదని మంత్రి అన్నారు.

హైదరాబాద్‌ బోనాలు తెలంగాణ సమాజంలోని భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతున్నాయని, గంగా జమునా సంస్కృతికి ప్రతీకగా నిలుస్తూ యావత్ దేశానికి లౌకిక సందేశాన్నిస్తున్నాయని మంత్రి సురేఖ పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం హైదరాబాద్‌ నగర ప్రత్యేకతను మరోసారి ప్రపంచానికి చాటిందని అన్నారు. అమ్మవారి చల్లని చూపు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలి. రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలి. రైతులు, మహిళలు, యువత, కార్మికులు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలి. అమ్మవార్ల దయతో తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలి. శాంతి, సౌభ్రాతృత్వం, సామాజిక సామరస్యం మరింత బలపడాలి అని మంత్రి సురేఖ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. దేవాదాయ శాఖ తరఫున నిర్వహించిన వరుణయాగంతో ప్రభుత్వ సంకల్పం సిద్ధించి, రాష్ట్రం ఎల్ నినో ప్రభావం నుంచి తేరుకుని, వర్షాలు పడుతుండటం అమ్మవార్ల మహిమేనని మంత్రి సురేఖ ఈ సందర్భంగా తెలిపారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు