హైదరాబాద్, ఆగస్టు 8(జనవాణి): హైడ్రాలో డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్లు, డ్రైవర్ల ఉద్యోగాల నియామకానికి భారీగా యువత తరలివచ్చింది. 100 మంది డీఆర్‌ఎఫ్ అసిస్టెంట్లు, 50 మంది డ్రైవర్ల పోస్టుల భర్తీకి సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజే 3 వేల మందికిపైగా అభ్యర్థులు హాజరుకావడంతో దరఖాస్తుల స్వీకరణ, శారీరక పరీక్షలకు టోకెన్ల జారీ సమయంలో కొంత గందరగోళం నెలకొంది.
ఒకేసారి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు ముందుకు రావడంతో వారిని నియంత్రించేందుకు హైడ్రా అధికారులు, పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో ఓ అధికారి అసహనంతో అభ్యర్థులతో పరుషంగా మాట్లాడినప్పటికీ.. అనంతరం పరిస్థితిని చక్కదిద్దారు.
లౌడ్‌స్పీకర్లలో పదేపదే ప్రకటన
అందరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని, ప్రతి ఒక్కరికీ శారీరక పరీక్షకు అవకాశం కల్పిస్తామని అధికారులు లౌడ్‌స్పీకర్ల ద్వారా పదేపదే ప్రకటించారు. దీంతో యువత పరిస్థితిని అర్థం చేసుకుని అధికారులకు సహకరించింది. పోలీసుల సహకారంతో ఎలాంటి తొక్కిసలాటకు అవకాశం లేకుండా అభ్యర్థులను క్రమబద్ధీకరించి ఎంపిక ప్రక్రియను కొనసాగించారు.
హైడ్రా ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 8, 9 తేదీల్లో సరూర్‌నగర్ స్టేడియంలో నియామక ప్రక్రియ కొనసాగనుంది. భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరైన నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.





















