హైదరాబాద్, సెప్టెంబర్ 22 (జనవాణి): హైదరాబాద్‌లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ పంచముఖ సంకటహర మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు మహాగణపతి దర్శనం కోసం వస్తున్నారు.
అయితే ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి వెళ్లాలనుకునే భక్తులకు కీలక సమాచారం. సెప్టెంబర్ 23 బుధవారం రాత్రి వరకే దర్శనానికి అనుమతి ఇవ్వనున్నారు. అనంతరం నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా గురువారం నుంచి మండపం వద్ద షెడ్డు, బ్యారికేడ్ల తొలగింపు ప్రక్రియ చేపట్టనున్నారు.
భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్ణయం మేరకు సెప్టెంబర్ 25న హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జన కార్యక్రమం జరగనుంది. అదే రోజు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం కూడా నిర్వహించనున్నారు. మధ్యాహ్నం లోపు నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శనానికి వచ్చే భక్తులు నిర్వాహకులకు సహకరించాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు కోరారు.
శోభాయాత్రకు ఏర్పాట్లు
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. భారీ గణనాథుడిని తరలించే మార్గంలో చెట్లు, విద్యుత్ వైర్లు అడ్డుగా ఉండే అవకాశాలను గుర్తించి వాటిని తొలగించే చర్యలు చేపడుతున్నారు.
సెప్టెంబర్ 25 శుక్రవారం తెల్లవారుజామున మహాగణపతి శోభాయాత్ర ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకుముందు గురువారం అర్ధరాత్రి మహాగణపతికి కలశ పూజ నిర్వహించనున్నారు. పూజలు పూర్తయిన అనంతరం గణపతిని భారీ ట్రాలీపైకి చేర్చి శోభాయాత్రగా తరలించనున్నారు.
ఖైరతాబాద్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సచివాలయం మీదుగా ఎన్టీఆర్ మార్గ్ వరకు కొనసాగనుంది. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 5 వద్ద మహాగణపతి నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, బుధవారం, గురువారం ఖైరతాబాద్ మహాగణపతి దర్శనానికి భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో రద్దీకి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్రను వీక్షించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నారు. భక్తుల వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను కూడా ఏర్పాటు చేశారు.




















