బాలాపూర్ లడ్డూకు మళ్లీ రికార్డు ధర.. ఈసారి రూ.39 లక్షలు!

బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం మరోసారి రికార్డు సృష్టించింది. ఏటా పెరుగుతూ వస్తున్న లడ్డూ ధర ఈసారి ఏకంగా రూ.39 లక్షలకు చేరింది. సాహెబ్‌నగర్‌కు చెందిన అర్బన్ గ్రూప్ అధినేత సామ ప్రణీత్ రెడ్డి ఈ ఏడాది లడ్డూను దక్కించుకున్నారు. గతేడాది రూ.35 లక్షలుగా ఉన్న ధరతో పోలిస్తే ఈసారి మరో రూ.4 లక్షలు పెరిగింది.

25 సెప్టెంబర్, 2026 2:21 PM•ByNarender Kumar Nangunoori

Share this article

బాలాపూర్ లడ్డూకు మళ్లీ రికార్డు ధర.. ఈసారి రూ.39 లక్షలు!

హైదరాబాద్,సెప్టెంబర్ 25 (జనవాణి): హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం మరోసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏటా రికార్డు ధర పలుకుతున్న బాలాపూర్ గణపతి లడ్డూ ప్రసాదం ఈసారి రూ.39 లక్షలకు వేలం వెళ్లింది. సాహెబ్‌నగర్‌కు చెందిన అర్బన్ గ్రూప్ అధినేత సామ ప్రణీత్ రెడ్డి లడ్డూను సొంతం చేసుకున్నారు. గతేడాది బాలాపూర్ గణేష్ లడ్డూ రూ.35 లక్షలకు కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ గౌడ్ దక్కించుకున్నారు. దీంతో పోలిస్తే ఈ ఏడాది లడ్డూ ధర మరో రూ.4 లక్షలు పెరిగింది.

రూ.450తో మొదలై.. రూ.39 లక్షలకు

బాలాపూర్ గణేష్ ఉత్సవ కమిటీ 1980లో ఏర్పాటైంది. అయితే లడ్డూ వేలం మాత్రం 1994లో ప్రారంభమైంది. తొలి వేలంలో కొలను మోహన్ రెడ్డి రూ.450కు లడ్డూను దక్కించుకున్నారు. మరుసటి ఏడాది కూడా ఆయనే రూ.4,500కు లడ్డూను సొంతం చేసుకున్నారు. అనంతరం ప్రతి ఏడాది వేలం ధర పెరుగుతూ వచ్చింది.

2002లో తొలిసారిగా లడ్డూ ధర రూ.లక్ష మార్కును దాటింది. అప్పటి నుంచి బాలాపూర్ లడ్డూ వేలం ధర భారీగా పెరుగుతూ వచ్చింది. 2015లో రూ.10.32 లక్షలు, 2018లో రూ.16.60 లక్షలు, 2022లో రూ.24.60 లక్షలు, 2024లో రూ.30.01 లక్షలు, 2025లో రూ.35 లక్షలకు చేరింది. కరోనా పరిస్థితుల కారణంగా 2020లో లడ్డూ వేలం రద్దు చేశారు. ఆ ఏడాది లడ్డూ ప్రసాదాన్ని అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు.

బాలాపూర్ లడ్డూను ఎందుకు దక్కించుకోవాలనుకుంటారు?

బాలాపూర్ గణేష్ లడ్డూను సొంతం చేసుకుంటే కుటుంబానికి అన్ని విధాలా మంచి జరుగుతుందని భక్తుల్లో విశ్వాసం ఉంది. ఈ నమ్మకంతోనే ప్రతి ఏడాది లడ్డూ వేలంలో పెద్ద ఎత్తున పోటీ నెలకొంటుంది. లడ్డూ వేలం బాలాపూర్ గణేష్ ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా కొనసాగుతోంది.

1994 నుంచి బాలాపూర్ లడ్డూ వేలం ధరలు

1994 – కొలను మోహన్ రెడ్డి – రూ.450

1995 – కొలను మోహన్ రెడ్డి – రూ.4,500

1996 – కొలను కృష్ణారెడ్డి – రూ.18,000

1997 – కొలను కృష్ణారెడ్డి – రూ.28,000

1998 – కొలను మోహన్ రెడ్డి – రూ.51,000

1999 – కల్లం అంజిరెడ్డి – రూ.65,000

2000 – కల్లం ప్రతాప్ రెడ్డి – రూ.66,000

2001 – జీ. రఘునందన్ చారి – రూ.85,000

2002 – కందాడ మాధవరెడ్డి – రూ.1,05,000

2003 – చిగిరింత బాల్ రెడ్డి – రూ.1,55,000

2004 – కొలను మోహన్ రెడ్డి – రూ.2,01,000

2005 – ఇబ్రం శేఖర్ – రూ.2,08,000

2006 – చిగిరింత తిరుపతి రెడ్డి – రూ.3,00,000

2007 – జీ. రఘునందన్ చారి – రూ.4,15,000

2008 – కొలను మోహన్ రెడ్డి – రూ.5,07,000

2009 – సరిత – రూ.5,10,000

2010 – కొడాలి శ్రీధర్ బాబు – రూ.5,35,000

2011 – కొలను బ్రదర్స్ – రూ.5,45,000

2012 – పీ. గోవర్దన్ రెడ్డి – రూ.7,50,000

2013 – తీగల కృష్ణారెడ్డి – రూ.9,26,000

2014 – సింగిరెడ్డి జైహింద్ రెడ్డి – రూ.9,50,000

2015 – కల్లెం మదన్ మోహన్ రెడ్డి – రూ.10,32,000

2016 – స్కైలాబ్ రెడ్డి – రూ.14,65,000

2017 – నాగం తిరుపతి రెడ్డి – రూ.15,60,000

2018 – టీ. శ్రీనివాస్ గుప్తా – రూ.16,60,000

2019 – కొలను రామ్ రెడ్డి – రూ.17,60,000

2020 – కరోనా కారణంగా వేలం రద్దు

2021 – రమేష్ బాబు, మర్రి శశాంక్ రెడ్డి – రూ.18,90,000

2022 – వంగేటి లక్ష్మారెడ్డి – రూ.24,60,000

2023 – దాసరి దాయనంద్ రెడ్డి – రూ.27,00,000

2024 – కొలను శంకర్ రెడ్డి – రూ.30,01,000

2025 – లింగాల దశరథ గౌడ్ – రూ.35,00,000

2026 – సామ ప్రణీత్ రెడ్డి – రూ.39,00,000

శోభాయాత్ర ప్రారంభం

లడ్డూ వేలం ముగిసిన అనంతరం బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ప్రారంభమైంది. బాలాపూర్ నుంచి ప్రారంభమైన శోభాయాత్ర గణేష్ చౌక్, డైమండ్ హోటల్ వై-జంక్షన్, గుర్రం చెరువు కట్టమైసమ్మ ఆలయం, కేశవగిరి-చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్, ఫలక్‌నుమా, అలియాబాద్, నాగుల్‌చింత, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు సాగుతుంది. అనంతరం కేటాయించిన క్రేన్ వద్ద బాలాపూర్ గణేష్ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు