హైదరాబాద్, సెప్టెంబర్ 25 (జనవాణి): హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. నగరంలోని ప్రధాన మార్గాల్లో గణేశ్ విగ్రహాల శోభాయాత్రలు సందడి చేస్తున్నాయి. అయితే అందరి దృష్టిని ఆకర్షించే ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర మాత్రం సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యమైంది.
ఖైరతాబాద్ బడా గణేశ్‌ను ఉదయమే టస్కర్‌పైకి చేర్చి శోభాయాత్ర ప్రారంభించాల్సి ఉండగా.. మహాగణపతిని లిఫ్ట్ చేసే బాహుబలి క్రేన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విగ్రహాన్ని టస్కర్‌పైకి చేర్చడంలో జాప్యం జరిగింది. అధికారులు సమస్యను పరిష్కరించిన అనంతరం మహాగణపతిని టస్కర్‌పైకి చేర్చారు. టస్కర్‌పై వెల్డింగ్ పనులు కూడా పూర్తి చేయడంతో రెండు గంటలకు పైగా ఆలస్యంగా శోభాయాత్ర ప్రారంభమైంది.
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్రను చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహాగణపతిని ఎన్టీఆర్ గార్డెన్స్ ఎదురుగా ఉన్న క్రేన్ వద్ద హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు. ముందుగా మధ్యాహ్నం ఒంటి గంటలోపు నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు భావించినప్పటికీ.. శోభాయాత్ర ఆలస్యం కావడంతో నిమజ్జనం కూడా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
అయితే మధ్యాహ్నం 2 గంటల్లోపు ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం పూర్తి చేస్తామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. నిమజ్జన వేడుకల్లో ప్రజలు, వివిధ శాఖలు హైదరాబాద్ సిటీ పోలీసులకు సహకరించాలని కోరారు. దొంగతనాలు, మహిళలపై వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 25 షీ టీమ్స్, 15 సీసీఎస్ క్రైమ్ టీమ్‌లను రంగంలోకి దించినట్లు వెల్లడించారు.
గణేశ్ నిమజ్జనాన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సుమారు 30 వేల మంది పోలీసులను బందోబస్తు విధుల్లో మోహరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్ వైపు వచ్చే మార్గాల్లో ఏర్పాటు చేసిన దాదాపు 10 వేల సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించనున్నారు. పాతబస్తీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన ఆరు కంపెనీల బలగాలను మోహరించారు.
మరోవైపు బాలాపూర్ గణేశ్ శోభాయాత్రకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికాసేపట్లో శోభాయాత్ర ప్రారంభం కానుంది. బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంలో ఎంత ధర పలుకుతుందనే ఆసక్తి భక్తుల్లో నెలకొంది. బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యే శోభాయాత్ర గణేశ్ చౌక్, డైమండ్ హోటల్ వై-జంక్షన్, గుర్రం చెరువు కట్టమైసమ్మ ఆలయం, కేశవగిరి-చంద్రాయణగుట్ట ఫ్లైఓవర్, ఎంబీఎన్‌ఆర్ క్రాస్‌రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్ బ్రిడ్జ్, అలియాబాద్, నాగుల్‌చింత, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎస్ఏ బజార్, ఎంజే మార్కెట్, అబిడ్స్ క్రాస్‌రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, అంబేద్కర్ విగ్రహం వరకు సాగనుంది. అనంతరం కేటాయించిన క్రేన్ వద్ద బాలాపూర్ గణేశ్ విగ్రహాన్ని హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం చేయనున్నారు.




















