హైదరాబాద్,సెప్టెంబర్ 25 (జనవాణి): హైదరాబాద్‌లో ప్రసిద్ధ ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. టస్కర్ ముందు దానం నాగేందర్ కొబ్బరికాయ కొట్టిన అనంతరం శోభాయాత్రను ప్రారంభించారు. భారీ జనసందోహం నడుమ మహాగణపతి నిమజ్జనానికి తరలివెళ్తున్నారు.
ఈ సందర్భంగా మహాగణపతి ఎదుట దానం నాగేందర్ నృత్యం చేశారు. ఆయనతో పాటు మహిళా కానిస్టేబుళ్లు, స్థానిక నాయకులు కూడా ఉత్సాహంగా డ్యాన్స్ చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. భవనాలపై నుంచి భక్తులు పూలు జల్లుతూ గణనాథుడికి వీడ్కోలు పలుకుతున్నారు.
Loading Tweet...
అయితే మహాగణపతి శోభాయాత్ర ప్రారంభంలో సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యమైంది. బాహుబలి క్రేన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో బడా గణేశ్‌ను టస్కర్‌పైకి ఎక్కించడం ఆలస్యమైంది. దీంతో ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర సుమారు మూడు గంటలు ఆలస్యంగా ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది.
ప్రస్తుతం ఎక్కడా ఆగకుండా మహాగణపతి శోభాయాత్ర ముందుకు సాగుతోంది. ఆలస్యం కారణంగా భక్తుల రద్దీ మరింత పెరుగుతోంది. నిమజ్జన యాత్రను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు రోడ్లపైకి చేరుకున్నారు.





















