హైదరాబాద్, 14 (జనవాణి): వినాయక చవితి వచ్చిందంటే దేశవ్యాప్తంగా ప్రత్యేకంగా చర్చకు వచ్చే పేరు ఖైరతాబాద్ బడా గణేశుడు. ప్రతి ఏడాది విభిన్న రూపం, భారీ విగ్రహంతో భక్తులను ఆకట్టుకునే ఖైరతాబాద్ మహాగణపతి.. ఈసారి 69 అడుగుల ఎత్తులో ‘పంచముఖ సంకటహర మహాగణపతి’గా భక్తులకు దర్శనమిస్తున్నాడు.
మహాగణపతి తొలిపూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ఆయన సతీమణి జానకి శుక్లా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలిపూజకు హాజరైన గవర్నర్ దంపతులకు మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారిని విగ్రహం వద్దకు తీసుకెళ్లి అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మహాగణపతికి పట్టువస్త్రాలు సమర్పించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణనాథుడికి భారీ కండువా, యజ్ఞోపవీతాన్ని సమర్పించారు.

దేశవ్యాప్తంగా ఖైరతాబాద్ గణేశుడికి ప్రత్యేక గుర్తింపు
ఖైరతాబాద్ గణేశుడికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అన్నారు. మహారాష్ట్రలో ప్రారంభమైన గణేశ్ ఉత్సవాలు దేశవ్యాప్తంగా విస్తరించినప్పటికీ, ఖైరతాబాద్ మహాగణపతికి ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. 72 ఏళ్లుగా భారీ గణేశ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించడం విశేషమని ఆయన అన్నారు. గణపతి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు
తొలిపూజ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసే వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేందుకు భక్తులు కూడా సహకరించాలని ఆయన కోరారు.
భక్తుల కోసం భారీ ఏర్పాట్లు
ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీసులు, నిర్వాహకులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఖైరతాబాద్ పరిసరాల్లో 12 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 150కి పైగా సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య భక్తులు మహాగణపతిని దర్శించుకుంటున్నారు.




















