న్యూఢిల్లీ,సెప్టెంబర్ 29 (జనవాణి): ఔషధాలు, వైద్య పరికరాల ధరల విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మందుల తయారీ వ్యయం, వాటి ఎమ్మార్పీ మధ్య భారీ వ్యత్యాసం ఉండటంపై కేంద్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌పై మంగళవారం విచారణ సందర్భంగా క్యాన్సర్ మందుల ధరల విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
రూ.3 వేల తయారీ వ్యయం.. రూ.27 వేల ఎమ్మార్పీ
ఒక క్యాన్సర్ మందు తయారీకి సుమారు రూ.3 వేలు ఖర్చవుతుండగా దాని ఎమ్మార్పీ రూ.27 వేలుగా ఎలా నిర్ణయిస్తారని కేంద్రాన్ని సుప్రీంకోర్టు నిలదీసింది. కొన్ని మందుల ధరలు వాటి తయారీ వ్యయం కంటే పది రెట్లు అధికంగా ఉండటాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఇంత భారీ వ్యత్యాసానికి కారణమేంటని ప్రశ్నించింది.
16 శాతం పరిమితిపై ప్రశ్నలు
ఔషధాల ధరల విషయంలో 16 శాతం పరిమితిని ఎందుకు సమర్థంగా అమలు చేయడం లేదని కూడా సుప్రీంకోర్టు ఆరా తీసింది. రీటైలర్ మార్జిన్ 16 శాతానికి మించి ఉండాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. మందులు, వైద్య పరికరాలను ప్రజలకు నిత్యావసరమైనవిగా పరిగణించి, వాటి ధరలను నియంత్రించేందుకు మరింత సమర్థవంతమైన విధానం ఎందుకు తీసుకురావడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది.
DPCO పరిధిలోకి ఎందుకు తీసుకురారు?
ప్రతి మందు, ప్రతి వైద్య పరికరం ప్రజల ఆరోగ్యానికి అవసరమైనవేనని పేర్కొన్న ధర్మాసనం.. అలాంటప్పుడు వాటిని డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ (DPCO) పరిధిలోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించింది. అధిక ఎమ్మార్పీల కారణంగా ఆయుష్మాన్ భారత్ వంటి ప్రభుత్వ ఆరోగ్య పథకాల కింద ఖర్చు చేస్తున్న ప్రజాధనం దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశంపై పిటిషనర్ల వాదనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఔషధ తయారీదారులు, విక్రేతలు, ఆస్పత్రులు, రోగులు ఇలా అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడేలా పరిష్కారం కనుగొంటామని వెల్లడించారు.
తదుపరి విచారణను అక్టోబర్ 12కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.




















