చెన్నై, ఆగస్టు 7: తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ విడాకుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్ సతీమణి సంగీత విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు. చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ఆమె, కేసును ఇకపై కొనసాగించే ఉద్దేశం లేదని కోర్టుకు తెలిపారు. దీంతో ఆమె అభ్యర్థనను ఆమోదించిన న్యాయస్థానం, పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు నమోదు చేసి కేసును ముగించింది.
కోర్టు వివరాల ప్రకారం, సంగీత తరఫున విడాకుల పిటిషన్ ఉపసంహరణకు ప్రత్యేకంగా దరఖాస్తు దాఖలైంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె స్వయంగా తన నిర్ణయాన్ని ధ్రువీకరించారు. ప్రతివాది తరఫు న్యాయవాదికి నోటీసు జారీ చేయగా, పిటిషన్ ఉపసంహరణపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో కోర్టు కేసును ఉపసంహరించినట్లుగా ముగిస్తూ, అవసరమైతే భవిష్యత్తులో మళ్లీ కొత్త పిటిషన్ దాఖలు చేసుకునే స్వేచ్ఛను సంగీతకు కల్పించింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడు ఎన్నికలకు కొద్దిరోజుల ముందు సంగీత కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన భర్త విజయ్‌కు ఓ మహిళా నటితో వివాహేతర సంబంధం ఉందని తాను గుర్తించినట్లు పిటిషన్‌లో ఆరోపించారు. ఆ సంబంధాన్ని ముగిస్తానని విజయ్ హామీ ఇచ్చినా, దానిని కొనసాగించారని పేర్కొన్నారు.
అలాగే విదేశీ పర్యటనలు, బహిరంగ కార్యక్రమాల్లో తనను పక్కనపెట్టి ఆ మహిళా నటితో కలిసి కనిపించేవారని, ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం వల్ల తనతో పాటు తమ ఇద్దరు పిల్లలు జేసన్ సంజయ్, దివ్య సాషా తీవ్ర మానసిక వేదనకు గురయ్యారని పిటిషన్‌లో ఆరోపించారు. తనకు అందుతున్న సౌకర్యాలను నిలిపివేయడంతో పాటు ఆర్థిక పరమైన ఆంక్షలు కూడా విధించారని పేర్కొన్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో దాంపత్య బంధం పూర్తిగా దెబ్బతిన్నదని, తాను తీవ్ర మానసిక వేదన, అవమానాన్ని ఎదుర్కొన్నానని సంగీత తన విడాకుల పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే తాజాగా ఆమె అదే పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడంతో కేసు ముగిసింది.





















