కళలు గోడల మధ్యే కాదు.. ప్రజల మధ్యకు రావాలి: కేంద్రమంత్రి పెమ్మసాని

కళలు కేవలం గోడల మధ్య పరిమితం కాకుండా ప్రజల మధ్యకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. కళలు ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబమని, సమాజ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

8 ఆగస్టు, 2026 8:09 PM•ByRalin

Share this article

కళలు గోడల మధ్యే కాదు.. ప్రజల మధ్యకు రావాలి: కేంద్రమంత్రి పెమ్మసాని

‘అమరావతి చిత్రకళా వీధి’ కార్యక్రమంలో మాట్లాడుతున్న కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

గుంటూరు, ఆగస్టు 8(జనవాణి): కళలు కేవలం గోడల మధ్య పరిమితం కాకుండా ప్రజల మధ్యకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్‌ శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్‌ అన్నారు. కళలు ఒక జాతి సంస్కృతికి ప్రతిబింబమని, సమాజ చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తాయని పేర్కొన్నారు. గుంటూరులో నిర్వహిస్తున్న ‘అమరావతి చిత్రకళా వీధి’ కార్యక్రమం కళాకారులకు గుర్తింపు తీసుకురావడంతో పాటు నగరానికి గౌరవాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.

ఆంధ్రప్రదేశ్‌ సృజనాత్మక, సాంస్కృతిక కమిషన్‌ ఆధ్వర్యంలో కొరటెపాడులో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘అమరావతి చిత్రకళా వీధి’ ప్రారంభ కార్యక్రమానికి శనివారం పెమ్మసాని ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కళాకారులు, శిల్పకారులు, విద్యార్థులతో ఆయన మాట్లాడారు.

కళలే చరిత్రకు సాక్ష్యాలు

కళలు మానవాళి కనుగొన్న అత్యంత ప్రాచీనమైన భాష అని పెమ్మసాని అన్నారు. మనుషులు మాట్లాడటం ప్రారంభించక ముందే చిత్రాలు గీశారని, అక్షరాలు పుట్టక ముందే తమ ఆలోచనలను రాతిపై చెక్కారని గుర్తుచేశారు. వేల సంవత్సరాల క్రితం జరిగిన రాజకీయ చర్చలు కాలగర్భంలో కలిసిపోయినా.. ఆనాటి శిల్పాలు, కళారూపాలు నేటికీ చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచాయని చెప్పారు.

ప్రస్తుతం మనం సృష్టిస్తున్న కళలు కూడా భవిష్యత్‌ తరాలకు చరిత్రగా మిగులుతాయని పేర్కొన్నారు. కళలు ఒక తరానికి వారసత్వం, ఒక ప్రాంత సృజనాత్మకతకు ప్రతీకగా నిలుస్తాయని తెలిపారు. కళాకారులను ప్రోత్సహించేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని పెమ్మసాని అన్నారు. కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న సాంస్కృతికశాఖ మంత్రి కందుల దుర్గేష్‌, కల్చర్‌ అండ్‌ క్రియేటివిటీ చైర్‌పర్సన్‌ తేజస్విని పొడబాటికి కృతజ్ఞతలు తెలిపారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ ఓ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే పట్టుదల, ఆసక్తి ఎంతో అవసరమని చెప్పారు.

గతేడాది రాజమండ్రిలో సుమారు 500 మంది కళాకారులతో ఇలాంటి కార్యక్రమం నిర్వహించగా.. ఈసారి గుంటూరులో దాదాపు 800 మంది కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చారని తెలిపారు. శంకర్‌విలాస్‌ బ్రిడ్జి పనుల కారణంగా ట్రాఫిక్‌ సమస్యలు ఉన్నప్పటికీ కళాకారులకు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ట్రాఫిక్‌ పోలీసులు, ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. కార్యక్రమం వల్ల ప్రజలకు కొంత అసౌకర్యం కలిగినా కళాకారులను ప్రోత్సహించేందుకు గుంటూరు ప్రజలు సహకరించాలని కోరారు.

ప్రతి ఒక్కరిలోనూ ప్రతిభ ఉంటుంది

ప్రతి ఒక్కరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గానో, డాక్టర్‌గానో మారలేరని పెమ్మసాని అన్నారు. ప్రతి వ్యక్తిలో ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసే అవకాశాలు సమాజంలో ఉండాలని చెప్పారు. కళలు ఎంతోమందికి ప్రశాంతతను అందించడంతో పాటు కొత్త ఆలోచనలు, సృజనాత్మకతను పెంపొందిస్తాయని తెలిపారు.

గుంటూరు ప్రజలు ‘అమరావతి చిత్రకళా వీధి’ని సందర్శించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శిల్పకళ, జానపద, సాంప్రదాయ, ఆధునిక కళారూపాలను ఆస్వాదించాలని కోరారు. విద్యార్థులు కళాకారులతో మమేకమై వారి అనుభవాలను తెలుసుకుని కొత్త విషయాలు నేర్చుకోవాలని సూచించారు.

కళాకారులకు గుర్తింపు, గుంటూరుకు గౌరవం, ఆంధ్రప్రదేశ్‌కు ఖ్యాతి తీసుకువచ్చేలా ‘అమరావతి చిత్రకళా వీధి’ వంటి కార్యక్రమాలు మరింత విస్తరించాలని పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆకాంక్షించారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు