మడకశిర, ఆగస్టు 7 (జనవాణి): శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర కెనరా బ్యాంకులో వెలుగుచూసిన భారీ గోల్డ్ లోన్ మోసం కేసును పోలీసులు ఛేదించారు. బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేసిన సుందరేష్ చారి నకిలీ బంగారు ఆభరణాలను అసలైనవిగా ధ్రువీకరించి రూ.70.66 లక్షల గోల్డ్ లోన్లు మంజూరు చేయించినట్లు గుర్తించారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి రూ.30.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేసు వివరాలను జిల్లా అదనపు ఎస్పీ కేవీ మహేష్, మడకశిర సీఐ రాజ్‌కుమార్ మీడియాకు వెల్లడించారు.
పోలీసులు మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిబండ మండలం ఎస్.రాయపురం గ్రామానికి చెందిన సుందరేష్ చారి (33) మడకశిర కెనరా బ్యాంకులో గోల్డ్ అప్రైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అనంతపురంలోని కెనరా బ్యాంకు రీజినల్ ఆఫీస్ నుంచి వచ్చిన రీ-అప్రైజర్ల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా, ఏడుగురు ఖాతాదారుల పేర్లపై ఉన్న 12 గోల్డ్ లోన్ ఖాతాల్లో తాకట్టు పెట్టిన సుమారు 872.8 గ్రాముల బంగారు ఆభరణాలు నకిలీవని తేలింది.
దీంతో సుందరేష్ చారి నకిలీ బంగారాన్ని అసలైనదిగా ధ్రువీకరించి, ఏడుగురు వ్యక్తుల పేర్లపై రూ.70.66 లక్షల గోల్డ్ లోన్లు మంజూరు చేయించినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. అనంతరం మడకశిర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ అంకిత సురాన, పెనుకొండ డీఎస్పీ నారాయణస్వామి పర్యవేక్షణలో సీఐ రాజ్‌కుమార్ కేసును దర్యాప్తు చేశారు. విచారణలో సుందరేష్ చారి చెడు వ్యసనాలకు బానిసై, జీతం సరిపోక తన అధికారిక హోదాను దుర్వినియోగం చేసినట్లు తేలింది. బ్యాంకుకు వచ్చే ఖాతాదారులతో పరిచయాలు పెంచుకుని, వారికి మాయమాటలు చెప్పి వారి పేర్లపై నకిలీ బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టించి, అసలైన బంగారమని ధ్రువీకరించి లోన్లు మంజూరు చేయించినట్లు పోలీసులు వెల్లడించారు.
మోసం ద్వారా పొందిన రూ.70.66 లక్షలలో ఎక్కువ మొత్తాన్ని బెంగళూరులో గుర్రపు పందేలపై ఖర్చు చేస్తూ జల్సాలు చేసినట్లు విచారణలో వెలుగుచూసింది. ఈ నేపథ్యంలో మడకశిర పట్టణంలోని మధుగిరి రోడ్డులో వై.బి.హళ్లి క్రాస్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.30.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
ఈ కేసులో ఇతర వ్యక్తుల ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బంగారు రుణాలు తీసుకునే సమయంలో బ్యాంకుల నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, అనుమానాస్పద పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు లేదా బ్యాంకు అధికారులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అలాగే గోల్డ్ అప్రైజర్ల నియామకంలో పూర్తి స్థాయి ధ్రువీకరణ చేపట్టడంతో పాటు, వారి పనితీరుపై నిరంతర పర్యవేక్షణ అవసరమని బ్యాంకు యాజమాన్యాలకు సూచించారు.





















