Bank of Baroda | ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ బరోడా కస్టమర్ల భారీ డేటా లీకైందన్న ఆరోపణలు కలకలం సృష్టిస్తోంది. దాదాపు 1 టెరాబైట్ (1000జీబీ) మేర ఖాతాదారుల వ్యక్తిగత వివరాలు, ఆధార్, పాన్ కార్డు వివరాలు, బ్యాంక్ అంతర్గత పత్రాలను డార్క్ వెబ్‌లో విడుదల చేశామని హ్యాకింగ్ గ్రూప్ ట్రిపుల్ ఎక్స్ (TripleX) ప్రకటించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది.
జూలై 24వ తేదీన డార్క్ వెబ్ మానిటరింగ్ ప్లాట్‌ఫామ్‌లో వెలువడిన వివరాల ప్రకారం లక్ష నుంచి మూడు లక్షల వరకు ఖాతాదారుల అకౌంట్ ఓపెనింగ్ దరఖాస్తులు, వాటటికి జత చేసిన ఫొటోలు, గుర్తింపు పత్రాలు లీకయ్యాయని ట్రిపుల్ ఎక్స్ హ్యాకింగ్ గ్రూప్ వెల్లడించింది. అంతేకాదు ఆధార్ కార్డు వివరాలు, సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ సమాచారం, రుణ దరఖాస్తులు, నెట్ బ్యాంకింగ్ యూజర్ వివరాలతో పాటు ఎన్‌ఆర్ఐ, కార్పొరేట్ బ్యాంకింగ్‌కు సంబంధించిన పత్రాలు కూడా లీకైన డేటాలో ఉన్నాయని పేర్కొంది.
బ్యాంక్ పత్రాలు కూడా లీకయ్యాయా?
కస్టమర్ల డేటాతో పాటు బ్యాంక్‌కు సంబంధించిన కీలకమైన అంతర్గత పత్రాలు కూడా లీకయ్యాయని క్యాష్‌లెస్ కన్యూమర్ వ్యవస్థాపకుడు, సైబర్ భద్రతా నిపుణుడు శ్రీకాంత్ లక్ష్మణన్ ట్విట్టర్ (ఎక్స్) వేదికగా వెల్లడించారు. హ్యాకర్లు విడుదల చేసిన కొన్ని నమూనా ఫైళ్లను పరిశీలించగా బ్రాంచ్ ఆడిట్ నివేదికలు, లోన్ అప్రైజల్ పత్రాలు, విజిలెన్స్ విచారణ రికార్డులు, BoB World ఆడిట్ నివేదికలు, దేశవ్యాప్తంగా పలు బ్రాంచ్‌ల ఖాతాదారుల దరఖాస్తు ఫారాలు ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనను ఆయన సైబర్ విపత్తుగా ప్రకటించారు.
డేటా లీక్‌పై స్పందించిన బ్యాంక్ ఆఫ్ బరోడా
కాగా, భారీగా కస్టమర్ల డేటా లీకైందన్న వార్తలను దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారికంగా స్పందించింది. బ్యాంక్‌లోని ఓ అధికారి ఈమెయిల్ ఖాతాను హ్యాక్ చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు కొంత డేటాను యాక్సెస్ చేశారని వెల్లడించింది. ఈ ఘటనను వెంటనే గుర్తించి తక్షణ నివారణ చర్యలు చేపట్టామని తెలిపింది. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్‌లోకి ఎవరూ ఎంటర్ కాలేదని.. అవి సురక్షితంగానే ఉన్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని క్షుణ్నంగా పరిశీలించడానికి సమగ్ర ఫొరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ చేపట్టామని చెప్పింది. కస్టమర్ల డేటా భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని స్పష్టం చేసింది.




















