Redmi Note 17 5G | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షావోమీ సబ్‌బ్రాండ్ అయిన రెడ్‌మీ తన కొత్త రెడ్‌మీ నోట్ 17 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీని ఖరారు చేసింది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిన ఈ మొబైల్‌ను ఆగస్టు 6వ తేదీన భారత మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, దీర్ఘకాలిక సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు వెల్లడించింది.
బ్యాటరీనే ప్రధాన ఆకర్షణ
ఈ రెడ్‌మీ నోట్ 17 5జీ స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీనే ప్రధాన ఆకర్షణ అని చెప్పొచ్చు. ఇది 8000mAh సామర్థ్యం కలిగిన బ్యాటరీతో వస్తుంది. అందుకే ఈ మోడల్‌ను mAhster Editionగా ప్రచారం చేస్తోంది. ఎక్కువగా వీడియోలు చూసేవారు, గేమ్స్ ఆడేవారిని దృష్టిలో ఉంచుకుని దీన్ని తీసుకొస్తున్నట్లు రెడ్‌మీ తెలిపింది.
డిస్‌ప్లే - కలర్ ఆప్షన్లు
ఈ ఫోన్‌లో AMOLED డిస్‌ప్లేను అందిస్తున్నట్లు రెడ్‌మీ కంపెనీ తెలిపింది. ఈ డిస్‌ప్లే కారణంగా మంచి కలర్ క్వాలిటీ, మెరుగైన కాంట్రాస్ట్, స్పష్టమైన విజువల్స్ లభిస్తాయని చెప్పింది. ముఖ్యంగా వీడియోలు చూసేవారికి ఇది కొత్త అనుభూతిని కలిగిస్తుందని చెప్పింది. ఈ మొబైల్ ఇండియాలో బ్లూ, పింక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రానుంది.
ప్రాసెసర్, కెమెరా వివరాలు
భారత వెర్షన్‌కు సంబంధించి పూర్తి స్పెసిఫికేషన్లను రెడ్‌మీ ఇంకా వెల్లడించలేదు. కాకపోతే చైనాలో విడుదలైన మోడల్‌లో ఉన్న ఫీచర్లే ఇందులో ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మోడల్‌లో Qualcomm Snapdragon 4 Gen 4 Octa Core ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఈ మొబైల్‌లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం ముందుభాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఇండియన్ మోడల్‌లో కూడా ఇవే ఫీచర్లు ఇచ్చే అవకాశం ఉంది.
లీకైన వివరాల ప్రకారం ఈ ఫోన్ బేస్ వేరియంట్‌లో 6GB LPDDR4x RAM, 128GB UFS 2.2 స్టోరేజీ అందించనున్నారు. ఇక ఇందులో ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS3 ఆపరేటింగ్ సిస్టమ్ అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఫోన్‌కు నాలుగేళ్ల ఓఎస్ అప్‌డేట్లు, ఐదేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్లను అందించనుందని సమాచారం. అంటే దీర్ఘకాలం ఒకే ఫోన్‌ను వినియోగించాలని అనుకునేవారిని ఇది ప్రత్యేకంగా ఆకట్టుకునే అవకాశం ఉంది.
ధర ఎంత ఉండొచ్చు?
ఈ స్మార్ట్‌ఫోన్ ధరను రెడ్‌మీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం రెడ్‌మీ నోట్ 17 5జీ బేస్ వేరియంట్ ధర రూ.30వేలకు పైగా ఉండే అవకాశం ఉంది. ఆగస్టు 6న జరిగే లాంచింగ్ ఈవెంట్‌లోనే దీని ధరతో పాటు పూర్తి స్పెసిఫికేషన్లు వెల్లడయ్యే అవకాశం ఉంది. లాంచింగ్ అనంతరం ఆగస్టు 11వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు ప్రారంభమవుతాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌తో పాటు షావోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్ల ద్వారా ఈ స్మార్ట్‌ఫోన్‌ను విక్రయించున్నారు.




















