పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం మార్కెట్లపై తీవ్రంగా కనిపిస్తోంది. దేశీయ, అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. బులియన్ మార్కెట్లు మాత్రం మిశ్రమ స్పందనను కనబరుస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగినా.. దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధరలు భారీగా తగ్గడం గమనార్హం. అంతర్జాతీయ బులియన్ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర సుమారు 1 శాతం పెరిగి 4,399 డాలర్లకు చేరింది. వెండి ధర కూడా 1.38 శాతం పెరిగి 66 డాలర్లకు చేరుకుంది. దేశీయ కమోడిటీ మార్కెట్ అయిన ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ 694 పాయింట్లు పెరిగి రూ.1,53,300 వద్దకు చేరింది. సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ కూడా 1,278 పాయింట్లు పెరిగి రూ.2,40,705 వద్ద కొనసాగుతోంది.
మార్కెట్‌లో బంగారం ధరలు
దేశీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర భారీగా తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,310గా ఉంది. ఇది గత ముగింపుతో పోలిస్తే ఏకంగా రూ.10,400 తగ్గింది. గ్రాము ధర రూ.15,431గా ఉండగా.. 100 గ్రాముల ధర రూ.15,43,100గా ఉంది.
22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,41,450గా ఉంది. గత ముగింపుతో పోలిస్తే ఇది రూ.9,500 తగ్గింది. గ్రాము ధర రూ.14,145గా, 100 గ్రాముల ధర రూ.14,14,500గా ఉంది.
18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,15,730గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,800 తగ్గింది. గ్రాము ధర రూ.11,573గా, 100 గ్రాముల ధర రూ.11,57,300గా ఉంది.
వెండి ధరలో మార్పు లేదు
దేశీయ మార్కెట్‌లో వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కిలో వెండి ధర రూ.2,50,000, తులం ధర రూ.2,500గా ఉంది. గత ముగింపుతో పోలిస్తే ధరలో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,55,000గా ఉండగా.. తులం వెండి ధర రూ.2,550గా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నప్పటికీ.. దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడం ఇన్వెస్టర్లు, వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. మార్కెట్‌లోని తాజా పరిణామాలు, అంతర్జాతీయ పరిస్థితులను బట్టి ధరల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.




















