సినిమా డెస్క్: అక్కినేని అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూసిన క్షణం ఎట్టకేలకు వచ్చింది. హీరో అఖిల్ అక్కినేని నటించిన 'లెనిన్' సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. దాదాపు 11 ఏళ్ల సినీ ప్రయాణం తర్వాత అఖిల్‌కు భారీ కమర్షియల్ హిట్ దక్కడంతో అభిమానుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన 'లెనిన్' సక్సెస్ మీట్‌లో హీరో నాగార్జున చేసిన ప్రసంగం అందరినీ భావోద్వేగానికి గురి చేసింది. అఖిల్, నాగచైతన్య ఇద్దరి విజయాల కోసం అక్కినేని అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశారని, ఇప్పుడు 'లెనిన్' విజయంతో ఆ నిరీక్షణకు ఫలితం దక్కిందని ఆయన అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ.. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు అఖిల్‌కు ఒక మంచి హిట్ రావాలని తాను, హీరోయిన్ భాగ్యశ్రీ కలిసి మొక్కుకున్నామని తెలిపారు. ఆ కోరికను స్వామివారు నెరవేర్చారని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, అడగ్గానే ఈ సినిమాకు అద్భుతమైన వాయిస్ ఓవర్ అందించిన జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
గత ఏడాది 'తండేల్', ఇప్పుడు 'లెనిన్' వరుస విజయాలు సాధించడం ఎంతో సంతోషంగా ఉందని నాగార్జున అన్నారు. ఈ సినిమా కోసం మొత్తం టీమ్ ఒకే లక్ష్యంతో పనిచేసిందని, హిట్ సాధించాలనే పట్టుదల ప్రతి ఒక్కరిలో కనిపించిందని ప్రశంసించారు.
నిర్మాత నాగవంశీ నిర్మాణం నుంచి మార్కెటింగ్ వరకు ప్రతి బాధ్యతను అద్భుతంగా నిర్వహించారని చెప్పారు. దర్శకుడు నందు తన డైలాగులు, కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడని కొనియాడారు. హీరోయిన్ భాగ్యశ్రీ తన అద్భుతమైన నటనతో సినిమాకు మరింత బలం చేకూర్చిందని ప్రశంసించారు. ఈ టీమ్ వర్క్ చూస్తుంటే తనకూ ఇలాంటి విజయానుభూతి కలిగించే సినిమా చేయాలనే కోరిక కలుగుతోందని సరదాగా వ్యాఖ్యానించారు.
అయితే, ప్రసంగంలో అత్యంత భావోద్వేగ క్షణం అఖిల్ గురించి మాట్లాడినప్పుడే కనిపించింది. చిన్నప్పటి నుంచే అఖిల్ చాలా ఎనర్జీతో ఉండేవాడని, డాక్టర్లు కూడా ఎక్కువసేపు నేలపై ఆడనివ్వమని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు.
సినిమాల్లో నిలదొక్కుకోవడానికి అఖిల్ ఎంతో కష్టపడ్డాడని, షూటింగ్‌ల్లో గాయపడినా, ఆశించిన విజయాలు రాకపోయినా ఎప్పుడూ బయటకు బాధను వ్యక్తం చేయకుండా తనలో తానే మౌనంగా ఉండేవాడని చెబుతూ నాగార్జున కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఇటీవల అఖిల్ జీవితంలో వచ్చిన సానుకూల మార్పులే అతనికి మంచి రోజులు తీసుకొచ్చాయని, ఇప్పుడు ఆ కష్టం విజయంగా మారడం తనకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. చివరగా "ఎస్... అయ్యగారే నంబర్ వన్" అంటూ నాగార్జున తన ప్రసంగాన్ని ముగించగా సభా ప్రాంగణం చప్పట్లతో మార్మోగిపోయింది.
'లెనిన్' విజయంతో అఖిల్ కెరీర్‌లో కొత్త అధ్యాయం ప్రారంభమైందని అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ విజయం అక్కినేని కుటుంబానికే కాకుండా అభిమానులకు కూడా ఎంతో ప్రత్యేకమైన సందర్భంగా నిలిచింది.




















