నిమజ్జనం తర్వాత మొక్కగా మారే వినాయకుడు..ఈసారి సీడ్ గణేశుడిని పూజిద్దాం: చిరంజీవి

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఈ వినాయక చవితికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా సీడ్ గణేశుడిని పూజించాలని సూచించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణేశా ప్రతిమలను తన నివాసంలో ఆవిష్కరించిన చిరంజీవి.. పూజ అనంతరం ఇంట్లోనే నిమజ్జనం చేస్తే వినాయకుడు మొక్కగా మారి మనల్ని ఆశీర్వదిస్తాడని చెప్పారు.

31 ఆగస్టు, 2026 2:03 PM•ByNarender Kumar Nangunoori

Share this article

నిమజ్జనం తర్వాత మొక్కగా మారే వినాయకుడు..ఈసారి సీడ్ గణేశుడిని పూజిద్దాం: చిరంజీవి

హైదరాబాద్, ఆగస్టు 31 (జనవాణి): వినాయక చవితి వేడుకలను పర్యావరణహితంగా నిర్వహించాలని మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఈసారి భక్తులు సీడ్ గణేశుడిని పూజించాలని సూచించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపొందించిన సీడ్ గణేశా ప్రతిమలను ఆదివారం తన నివాసంలో ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పాల్గొన్నారు.

ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారైన విగ్రహాల నిమజ్జనం వల్ల చెరువులు, నదులు కలుషితమవుతున్నాయని చిరంజీవి అన్నారు. పండుగల వల్ల ప్రజలకు ఆరోగ్యం, భగవంతుడి ఆశీస్సులతో పాటు పర్యావరణానికి మేలు జరగాలని ఆకాంక్షించారు. సీడ్ గణేశుడిని పూజించి.. ఆ తర్వాత ఇంట్లోనే నిమజ్జనం చేస్తే దేవుడే మొక్కగా మారి మనల్ని ఆశీర్వదిస్తాడు. వినాయకుడిని పూజించిన పుణ్యంతో పాటు మొక్కను పెంచిన బాధ్యత కూడా నెరవేరుతుంది అని చిరంజీవి పేర్కొన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఒక యజ్ఞంలా ముందుకు తీసుకెళ్తూ కోట్లాది మొక్కలు నాటేలా ప్రజలను ప్రోత్సహిస్తున్న సంతోష్ కుమార్‌ను చిరంజీవి అభినందించారు. ఆయన చేపట్టిన పర్యావరణ కార్యక్రమాలకు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.

మొక్కలు నాటడం ఇప్పుడు అవసరం

కాలుష్యం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలు నాటడం ఎంపిక కాదని, అది ప్రతి ఒక్కరి బాధ్యత అని సంతోష్ కుమార్ అన్నారు. 2018లో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మూడు మొక్కలు నాటి, వాటిని మూడేళ్లు సంరక్షించి, మరో ముగ్గురిని మొక్కలు నాటేలా ప్రోత్సహించే విధానంతో కొనసాగుతోంది. ఇప్పటివరకు ఈ కార్యక్రమం ద్వారా సుమారు 19.6 కోట్ల మొక్కలు నాటినట్లు నిర్వాహకులు తెలిపారు. పౌరులు, హౌసింగ్ సొసైటీలు, ఆలయ కమిటీలు సీడ్ గణేశా కార్యక్రమాన్ని స్వీకరించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోరుతోంది.

దేవుడే.. వృక్షమైతే!

సీడ్ గణేశా విగ్రహాలను సహజమైన మట్టి, కోకోపీట్, కొబ్బరి పొడితో తయారు చేస్తారు. విగ్రహం లోపల వేప, చింత వంటి దేశీయ వృక్షాల విత్తనాలను ఉంచుతారు. నవరాత్రుల పూజల అనంతరం విగ్రహాన్ని కుండలో లేదా ఇంటి పెరట్లోని మట్టిలో ఉంచి నీరు పోస్తే అది కరిగిపోయి, విత్తనాలు మొలకెత్తి మొక్కగా ఎదుగుతాయి. అంటే నిమజ్జనం తర్వాత కూడా వినాయకుడి రూపంలో ఓ పచ్చని మొక్క మన ఇంట్లోనే పెరుగుతుందన్నమాట.

కరోనా సమయంలో ప్రారంభమైన సీడ్ గణేశా

సీడ్ గణేశా కార్యక్రమం 2020లో కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రారంభమైంది. అప్పట్లో ఏటా సుమారు 1.5 లక్షల విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. 2023లో కూకట్‌పల్లి నెక్సస్ మాల్‌లో చిన్నారుల్లో అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. 2025లో స్వర్ణగిరి టెంపుల్‌లో భారీ కార్యక్రమం చేపట్టి 5 లక్షల సీడ్ గణేశా విగ్రహాల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నారు. తాజాగా 2026 సీజన్‌కు చిరంజీవి స్వయంగా సీడ్ గణేశా ప్రతిమలను ఆవిష్కరించడంతో ఈ పర్యావరణహిత వినాయకుడిపై మరింత అవగాహన పెరుగుతోంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు