కోరిక తీరిందంటూ..అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన నిహారిక కొణిదెల

హైదరాబాద్‌లో బోనాల సందడి కొనసాగుతున్న వేళ సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల అమ్మవారిని దర్శించుకున్నారు. పాతబస్తీలోని మీరాలం మండిలో ఉన్న శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి బంగారు బోనం సమర్పించారు.

8 ఆగస్టు, 2026 1:45 PM•ByNarender Kumar Nangunoori

Share this article

కోరిక తీరిందంటూ..అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన నిహారిక కొణిదెల

హైదరాబాద్, ఆగస్టు 8 (జనవాణి): హైదరాబాద్‌ నగరంలో బోనాల ఉత్సవాల సందడి అంబరాన్ని తాకుతోంది. ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్న వేళ సినీ నటి, నిర్మాత కొణిదెల నిహారిక (Konidela Niharika) అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

పాతబస్తీలోని మీరాలం మండిలో ఉన్న శ్రీ మహంకాళేశ్వర దేవాలయానికి వెళ్లిన ఆమె అమ్మవారికి బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమె ఆలయానికి చేరుకోగానే అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అమ్మవారి ఆశీర్వాదాలు పొందిన అనంతరం ఆలయ అధికారులు నిహారికను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య.. శ్రీ మహంకాళేశ్వర ఆలయ చరిత్ర, విశిష్టతతో పాటు ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల సంప్రదాయాలు, ప్రత్యేకతలను ఆమెకు వివరించారు. గత ఏడాది నిహారిక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రానికి రెండు విభాగాల్లో జాతీయ పురస్కారాలు దక్కిన నేపథ్యంలో ఆమె అమ్మవారికి మొక్కు చెల్లించుకున్నట్లు అభిమానులు భావిస్తున్నారు.

అమ్మవారి దర్శనం అనంతరం నిహారిక మాట్లాడుతూ.. ప్రధాన బోనాల రోజు షూటింగ్ ఉండటంతో ఆలయానికి రాలేకపోయానని తెలిపారు. అందుకే ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం కోసం వచ్చినట్లు చెప్పారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగానని, చిన్నప్పటి నుంచి బోనాల సమయంలో మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలు ఎత్తుకుని వెళ్లే దృశ్యాలు తనను ఎంతగానో ఆకట్టుకునేవని నిహారిక పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితమే తనను కూడా ఎవరైనా బోనాలకు తీసుకెళ్తే బాగుంటుందని సరదాగా అనుకున్నానని, ఇంత త్వరగా ఆ కోరిక నెరవేరడం అమ్మవారి అనుగ్రహంగానే భావిస్తున్నానని చెప్పారు. అమ్మవారు ఎంతో శక్తివంతమైన దేవత అని, తల్లి దర్శనం తనకు ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని నిహారిక తెలిపారు. అమ్మవారి విగ్రహం దివ్య కాంతులతో అలరించిందని, మరోసారి కూడా అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం కలగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

నిహారిక కొణిదెల ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న భక్తులు, అభిమానులు ఆమెను చూసేందుకు ఆసక్తి చూపారు. పలువురు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. దీంతో కొద్దిసేపు ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు