ఈ వారం విడుదల కాబోతున్న విశ్వనాథ్ & సన్స్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సూర్య హీరోగా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరీ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి స్పందన రాగా.. ఇటీవల వచ్చిన ట్రైలర్ సినిమాను ఒక అందమైన ఫ్యామిలీ డ్రామాగా పరిచయం చేసింది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రివ్యూ షో కూడా పడింది. సినిమా చూసిన వారి నుంచి ప్రాథమికంగా పాజిటివ్ స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ పొందిన ఈ సినిమా 2 గంటల 28 నిమిషాల రన్‌టైమ్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కథ విషయానికొస్తే.. పిస్టల్ షూటింగ్‌లో గోల్డ్ మెడలిస్ట్ అయిన సంజయ్ విశ్వనాథ్‌కు మూడేళ్లు కూడా నిండని కుమారుడు ఉంటాడు. ఆ చిన్నారికి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ అవసరం కావడంతో సరైన డోనర్ కోసం వెతుకుతారు. అమెరికాలో ఉన్న మ్యాడీ డోనర్‌గా సరిపోతుందని తెలియడంతో ఆమెను ఇండియాకు తీసుకొచ్చేందుకు సంజయ్ ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో మ్యాడీతో అతడికి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారడం, ఆ తర్వాత వారి జీవితాల్లో చోటుచేసుకునే పరిణామాలే కథలో కీలకంగా ఉంటాయని తెలుస్తోంది.
ప్రివ్యూ టాక్ ప్రకారం ఫస్ట్ హాఫ్‌లో సంజయ్ విశ్వనాథ్ పాత్ర, అతని తల్లి ప్రోత్సాహం, పిస్టల్ షూటింగ్‌లో అతని ప్రయాణం, కొడుకు అనారోగ్యం వంటి అంశాలను చూపించారట. ఆ తర్వాత బోన్ మ్యారో డోనర్ కోసం అమెరికా వెళ్లడం, మమితా బైజు ఎంట్రీతో కథ మరో మలుపు తీసుకుంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రీ-ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశాలు బాగున్నాయని, ఇంటర్వెల్ సీన్ సెకండ్ హాఫ్‌పై ఆసక్తిని పెంచేలా ఉంటుందని అంటున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుందని, అక్కడక్కడా బోర్ అనిపించే సన్నివేశాలు ఉన్నాయని ప్రివ్యూ చూసిన వారి నుంచి టాక్ వినిపిస్తోంది.
ఇక సెకండ్ హాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్, డ్రామా సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని తెలుస్తోంది. ముఖ్యంగా సూర్య, మమితా బైజు మధ్య వచ్చే సన్నివేశాలు, వారి కెమిస్ట్రీ ఆకట్టుకునేలా ఉందని అంటున్నారు. కుటుంబ ప్రేక్షకులకు నచ్చే అంశాలు సినిమాలో బాగానే ఉన్నాయని ప్రివ్యూ టాక్ చెబుతోంది. మొత్తంగా సినిమా బాగుందని స్పందన వస్తున్నా.. ‘లక్కీ భాస్కర్’ స్థాయిలో అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే మంచి అనుభూతి కలిగిస్తుందని అంటున్నారు. అయితే ఇవన్నీ ప్రివ్యూ షో చూసిన వారి అభిప్రాయాలు మాత్రమే. పూర్తి స్థాయిలో సినిమా ఎలా ఉందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.




















