ఉజ్జయినిలో ఉద్రిక్తత.. షాహి మసీదు తొలగింపుపై పోలీసులతో నిరసనకారుల ఘర్షణ

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో షాహి మసీదులోని కొంత భాగాన్ని తొలగించే చర్య ఉద్రిక్తతకు దారితీసింది. సింహస్థ 2028 ఏర్పాట్లలో భాగంగా రోడ్డు విస్తరణ కోసం అధికారులు చర్యలు చేపట్టగా వాటిని వ్యతిరేకిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులపై రాళ్లు రువ్వడంతో భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు.

28 సెప్టెంబర్, 2026 1:56 PM•ByNarender Kumar Nangunoori

Share this article

ఉజ్జయినిలో ఉద్రిక్తత.. షాహి మసీదు తొలగింపుపై పోలీసులతో నిరసనకారుల ఘర్షణ

ఉజ్జయిని, సెప్టెంబర్ 28 (జనవాణి): మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో షాహి మసీదు తొలగింపు అంశం ఉద్రిక్తతకు దారితీసింది. సింహస్థ 2028ను దృష్టిలో ఉంచుకుని నగరంలో రోడ్డు విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా షాహి మసీదులోని రోడ్డు విస్తరణ పరిధిలోకి వచ్చే కొంత భాగాన్ని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు, ముస్లిం సంఘాల సభ్యులు పెద్ద సంఖ్యలో మసీదు వద్దకు చేరుకున్నారు. ఆదివారం రాత్రి నుంచే పలువురు అక్కడే ఉండి నిరసన తెలిపారు. సోమవారం ఉదయం తొలగింపు చర్యల కోసం అధికారులు, యంత్రాలతో అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

ఈ సందర్భంగా పోలీసులు, నిరసనకారుల మధ్య ఘర్షణ జరిగింది. పోలీసులపై రాళ్లు రువ్వినట్లు అధికారులు తెలిపారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీఛార్జ్ చేశారు. భారీగా భద్రతా బలగాలను మోహరించడంతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బందిని కూడా రంగంలోకి దించారు.

730 మీటర్ల రోడ్డు విస్తరణ

సింహస్థ 2028 సందర్భంగా ఉజ్జయినికి వచ్చే భక్తులు, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఖజూర్‌వాలి మసీదు నుంచి గణేష్ చౌక్ వరకు 730 మీటర్ల రహదారిని 15 మీటర్ల వెడల్పునకు విస్తరించే పనులు చేపట్టారు. ఈ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 272 నిర్మాణాలు ప్రభావితమవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మార్గంలో షాహి మసీదు భాగం కూడా రోడ్డు అలైన్‌మెంట్‌లోకి వస్తోంది. మసీదు చారిత్రక ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ స్థానికులు తొలగింపు చర్యలను వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు, రోడ్డు విస్తరణ ప్రాజెక్టు సింహస్థ 2028 ఏర్పాట్లలో భాగమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం షాహి మసీదు పరిసరాల్లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఘటనపై మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు