హైదరాబాద్, ఆగస్టు 4: రాజేంద్రనగర్ జోన్ పరిధిలో పౌర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అత్తాపూర్ సర్కిల్‌లోని నలంద నగర్, ప్లాంట్ డాక్టర్స్ కాలనీలో ఆయన పర్యటించి అక్కడి మౌలిక సదుపాయాల స్థితిగతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా కాలనీ పార్కు, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, పచ్చదనం, ఇతర ప్రజా సౌకర్యాలను కమిషనర్ పరిశీలించి స్థానిక సమస్యలపై అధికారులతో చర్చించారు. పౌర మౌలిక సదుపాయాల నిర్వహణను మరింత మెరుగుపరచాలని, అవసరమైన అభివృద్ధి పనులను గుర్తించి ప్రాధాన్యతతో చేపట్టాలని ఆదేశించారు.
ప్రజా వినియోగ ప్రదేశాల నాణ్యతను పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని, స్థానికుల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.ఈ పర్యటనలో రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్, అత్తాపూర్ డిప్యూటీ కమిషనర్‌తో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు పాల్గొన్నారు





















