వర్దన్నపేట గురుకులంలో ఫుడ్‌పాయిజన్.. హెచ్ఆర్సీ సుమోటో కేసు, కలెక్టర్‌కు నోటీసులు

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఫిరంగిగడ్డలోని గిరిజన బాలికల సంక్షేమ గురుకుల వసతి గృహంలో ఫుడ్‌పాయిజన్‌ కారణంగా 27మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ (టీజీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా కేసు నమోదు చేసింది.

4 ఆగస్టు, 2026 4:06 PM•ByRalin

Share this article

వర్దన్నపేట గురుకులంలో ఫుడ్‌పాయిజన్.. హెచ్ఆర్సీ సుమోటో కేసు, కలెక్టర్‌కు నోటీసులు

ఫుడ్‌పాయిజన్‌తో అస్వస్థతకు గురైన విద్యార్థినులకు చికిత్స అందిస్తున్న దృశ్యం

హైదరాబాద్‌/వరంగల్‌, ఆగస్టు 4: వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట మండలం ఫిరంగిగడ్డలోని గిరిజన బాలికల సంక్షేమ గురుకుల వసతి గృహంలో ఫుడ్‌పాయిజన్‌ కారణంగా 27మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌ (టీజీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా కేసు నమోదు చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వార్త మంగళవారం దినపత్రికల్లో ప్రచురితమైన నేపథ్యంలో గౌరవ ఛైర్‌పర్సన్‌ డా. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ ఆధ్వర్యంలోని కమిషన్‌ సుమోటోగా స్వీకరించింది. దీనిపై వరంగల్ జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది.

విద్యార్థినులు అస్వస్థతకు గురికావడానికి దారితీసిన పరిస్థితులు, ప్రభావిత విద్యార్థినుల సంఖ్య, వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, అందించిన వైద్య చికిత్స, వసతి గృహంలో ఆహార నాణ్యత, పరిశుభ్రత, పారిశుద్ధ్యంపై నిర్వహించిన విచారణ వివరాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టిన నివారణ చర్యలపై సమగ్ర నివేదికను సమర్పించాలని సూచించింది.

అసలేం జరిగిందంటే..

సోమవారం వర్ధన్నపేటలోని ఫిరంగిగడ్డ గిరిజన బాలికల సంక్షేమ గురుకుల వసతి గృహంలో చదువుకుంటున్న 27 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం రాత్రి చికెన్‌తో భోజనం చేసిన అనంతరం, సోమవారం ఉదయం టిఫిన్‌ చేసిన తర్వాత విద్యార్థినులు వాంతులు, తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నట్లు హాస్టల్‌ వార్డెన్‌, ఉపాధ్యాయులకు తెలిపారు. వెంటనే వారిని వర్ధన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విరీన్‌ ఆధ్వర్యంలో వైద్యులు విద్యార్థినులకు చికిత్స అందించారు. ఆదివారం రాత్రి తీసుకున్న చికెన్‌ లేదా సోమవారం ఉదయం తీసుకున్న టిఫిన్‌ కలుషితమై ఉండటంతో ఫుడ్‌పాయిజన్‌ జరిగి ఉండొచ్చని వైద్యులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఘటన విషయం తెలిసిన వెంటనే విద్యార్థినుల తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకున్నారు. పిల్లలకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విద్యార్థినులకు నాణ్యమైన ఆహారం, మెరుగైన వసతి కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే ఈ ఘటనను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించి, కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ ఏడాది సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఆలోపు ఘటనపై సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించింది.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు