బోనాల పండుగకు ముందే రహదారి పనులు పూర్తి చేయాలి.. దమ్మాయిగూడ అధికారులకు ఎంఎంసీ కమిషనర్ ఆదేశాలు

బోనాల పండుగకు ముందే దమ్మాయిగూడలోని పోచమ్మగుడి అప్రోచ్ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేసి, అనంతరం శాశ్వతంగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు.

3 ఆగస్టు, 2026 7:08 PM•ByRalin

Share this article

బోనాల పండుగకు ముందే రహదారి పనులు పూర్తి చేయాలి.. దమ్మాయిగూడ అధికారులకు ఎంఎంసీ కమిషనర్ ఆదేశాలు

దమ్మాయిగూడ, జవహర్‌నగర్‌లో పర్యటిస్తున్న మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

మల్కాజ్‌గిరి, ఆగస్టు 3: బోనాల పండుగకు ముందే దమ్మాయిగూడలోని పోచమ్మగుడి అప్రోచ్ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు పూర్తి చేసి, అనంతరం శాశ్వతంగా సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. దమ్మాయిగూడ, జవహర్‌నగర్ వార్డుల్లో సోమవారం నిర్వహించిన సమగ్ర క్షేత్రస్థాయి తనిఖీలో ఆయన పలు అభివృద్ధి పనులను పరిశీలించి సంబంధిత శాఖలకు దిశానిర్దేశం చేశారు.

ఎంఎల్‌ఆర్ కాలనీ, వీఎంఎస్ హోమ్స్, పోచమ్మగుడి, దమ్మాయిగూడ పాత గ్రామం, సాయి ప్రసన్న కాలనీ ప్రాంతాలను జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లు, ఏసీపీ, ఇంజినీరింగ్, పారిశుద్ధ్య విభాగాల అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. సత్యనారాయణ కాలనీ నుంచి శ్రీ సాయి ఇంద్రప్రభ కాలనీ గేటు వరకు చేపడుతున్న రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

చెరువు స్లూయిస్ గేట్ మరమ్మతులకు ఆదేశం

ఇందిరమ్మ చెరువు వద్ద స్లూయిస్ గేట్‌ను పరిశీలించిన కమిషనర్, వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని అత్యవసర మరమ్మతులు చేపట్టాలని నీటిపారుదల శాఖ అధికారులకు ఎంఎంసీ కమిషనర్ సూచించారు. పోచమ్మగుడి వెళ్లే అప్రోచ్ రోడ్డును బోనాల పండుగకు ముందే వెట్‌మిక్స్‌తో తాత్కాలికంగా బాగుచేసి, అనంతరం శాశ్వత సీసీ రోడ్డు నిర్మించాలని ఆదేశించారు.

వాణిజ్య సంస్థల వద్ద ట్రేడ్ లైసెన్సుల తనిఖీలను ముమ్మరం చేయాలని కమిషనర్ సూచించారు. అన్ని దుకాణాలు, వ్యాపార సంస్థలు చెల్లుబాటు అయ్యే ట్రేడ్ లైసెన్సులు కలిగి ఉన్నాయా అనే అంశాన్ని బిల్ కలెక్టర్లు, శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లు పరిశీలించాలని, గడువు ముగిసిన లైసెన్సులను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లైసెన్సు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

కొత్త నిర్మాణాలన్నింటినీ నిర్మాణ, కూల్చివేత వ్యర్థాల (సీ అండ్ డీ) ప్రాసెసింగ్ ప్లాంట్‌తో తప్పనిసరిగా అనుసంధానం చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. నిర్మాణ వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా శాస్త్రీయ పద్ధతిలో సేకరణ, రవాణా, రీసైక్లింగ్ జరిగేలా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.

రహదారుల పక్కన ఉన్న సైడ్ బెర్మ్‌లను సమతలీకరించి అదనపు ఇసుక, మట్టి, నిర్మాణ అవశేషాలను అవసరమైన ప్రాంతాల్లో వినియోగించాలని పారిశుద్ధ్య విభాగానికి సూచించారు. అలాగే ఖాళీగా ఉన్న ప్లాంటర్ బాక్స్‌లలో మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించాలని అర్బన్ బయోడైవర్సిటీ విభాగాన్ని ఆదేశించారు. నిర్వహణకు ఆసక్తి లేని ప్రాంతాల్లో ప్లాంటర్ బాక్స్‌లను తొలగించి పాదచారులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజలకు పరిశుభ్రమైన, సురక్షితమైన, పచ్చదనంతో కూడిన, ప్రణాళికాబద్ధమైన పట్టణ వాతావరణం కల్పించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు.

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు