నా భర్తను యాక్సిడెంట్ చేయించి చంపు.. లేదంటే నేను చస్తా.. కొరియర్ బాయ్‌ ప్రియుడితో భార్య వాట్సాప్ చాటింగ్!

యాక్సిడెంట్ చేయించి నా భర్తను చంపించు.. లేదంటే నేనే చస్తా అంటూ ప్రియుడితో ఓ భార్య చేసిన చాటింగ్ ఇప్పుడు వైరల్‌గా మారింది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌లో భర్తను చంపేందుకు ఆమె చేసిన కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

7 ఆగస్టు, 2026 5:57 PM•ByRalin

Share this article

నా భర్తను యాక్సిడెంట్ చేయించి చంపు.. లేదంటే నేను చస్తా.. కొరియర్ బాయ్‌ ప్రియుడితో భార్య వాట్సాప్ చాటింగ్!

ఏదులాపురం, ఆగస్టు 8 (జనవాణి): వేదమంత్రాల సాక్షిగా ఏడడుగులు నడిచిన భర్తను అడ్డు తొలగించేందుకు ఓ మహిళ పన్నిన కుట్ర ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో కాకుండా బయట ప్రమాదంలా కనిపించే విధంగా భర్తను హత్య చేయించాలని ప్రియుడిపై ఒత్తిడి చేస్తూ ఆమె పంపిన వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సందేశాలు పోలీసులను సైతం విస్తుపోయేలా చేశాయి. బాధితుడి ఫిర్యాదుతో మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్లు పోలీస్‌ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగా, కేసును తదుపరి విచారణ కోసం ఖమ్మం గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.

డోర్నకల్లు సీఐ చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్లు మండలం చిలుకోడు గ్రామానికి చెందిన గాదే రాజేశ్వరరావు ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయిప్రభాత్‌నగర్‌లో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. ఖమ్మంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్నాడు. 2016లో సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన యువతితో అతనికి వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

రాజేశ్వరరావు భార్యకు పురిమెట్ల సైదులు అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. కొరియర్‌ బాయ్‌గా పనిచేస్తున్న సైదులుతో ఆ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. గత నెల 27న మధ్యాహ్నం భోజనం చేసేందుకు రాజేశ్వరరావు ఇంటికి వెళ్లగా, తన భార్య సైదులుతో అత్యంత చనువుగా ఉండడాన్ని ప్రత్యక్షంగా గమనించాడు. దీంతో భార్య ప్రవర్తనపై అనుమానం మరింత బలపడింది.

ఈ వ్యవహారాన్ని పెద్దల సమక్షంలో తేల్చుకోవాలని నిర్ణయించిన రాజేశ్వరరావు, గత నెల 28న చిలుకోడు గ్రామంలో పంచాయతీ పెట్టాలని భావించాడు. ఇందుకోసం సమీపంలోని సంకేస (తాళ్లసంకేస) గ్రామంలో నివసిస్తున్న తన అన్న గాదే శ్రీనివాస్‌ను తీసుకురావడానికి బయలుదేరాడు. ఆ సమయంలో తన భార్యతో కనిపించిన సైదులు తనను వెనుక నుంచి అనుసరిస్తున్నట్లు గుర్తించాడు. అతడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా సైదులు అక్కడి నుంచి పరారయ్యాడు.

తర్వాత చిలుకోడు చేరుకున్న రాజేశ్వరరావు భార్య సెల్‌ఫోన్‌ను పరిశీలించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనను హత్య చేయాలని భార్య, ఆమె ప్రియుడు పురిమెట్ల సైదులుతో వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా జరిపిన సంభాషణలు బయటపడ్డాయి. ఇంట్లో హత్య చేయొద్దని, బయట ఎవరితోనైనా ప్రమాదంలా కనిపించే విధంగా యాక్సిడెంట్‌ చేయించాలని భార్య పదేపదే కోరినట్లు చాటింగ్‌లో ఉన్నట్లు బాధితుడు పేర్కొన్నాడు. "అలా చేయకపోతే తానే చనిపోతానని" కూడా ఆమె సందేశాల్లో పేర్కొన్నట్లు ఫిర్యాదులో వెల్లడించాడు. ఈ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్లు, సందేశాల ప్రతులను రాజేశ్వరరావు పోలీసులకు సమర్పించాడు.

తన భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తూ, ప్రియుడితో కలిసి తనను హత్య చేయడానికి కుట్ర పన్నిందని ఆరోపిస్తూ రాజేశ్వరరావు ఈ నెల 1న డోర్నకల్లు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కేసును ఖమ్మం గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశారు.

తదుపరి విచారణ కోసం గురువారం రాజేశ్వరరావు ఖమ్మం గ్రామీణ పోలీస్‌ స్టేషన్‌లో మరోసారి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై గ్రామీణ సీఐ ముష్కరాజును వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి విచారణ చేపడతామని తెలిపారు

Ralin

Written By

Ralin

Reporter

Ralin is an experienced journalist with over 12 years of experience in journalism and digital media. Ralin has worked with leading Telugu media organizations, including Eenadu, Andhra Jyothi, and Namasthe Telangana, and specializes in news writing, digital journalism, SEO content, editing, and feature writing.

Comments & Discussion (0)

No comments yet. Be the first to start the conversation!

Leave a Comment

మరిన్ని వార్తలు

ఎక్కువ చదివినవి

జిల్లా వార్తలు

సినిమా వార్తలు